
వైయస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల గడువు సమీపిస్తున్నా ఏకశిలానగరి కోదండరామాలయం అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలుత తాత్సారం చేయడం, వేడుకల వేళ తితిదే యంత్రాంగం హడావుడి చేయడం రివాజుగా మారింది.
సీతారాముల కల్యాణ వేదిక ప్రాంగణంలో 15,850 చదరపు మీటర్ల వైశాల్యంలో సిమెంటు అచ్చులు పరచాలని 10 నెలల కిందట అనుమతిచ్చారు. దీనికి రూ.1.80 కోట్లు కావాలని సివిల్ విభాగం సాంకేతిక నిపుణులు ప్రతిపాదించారు. గతేడాది మేలో రూ.1.50 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. మొదట ఒకే ఒక గుత్తేదారు పోటీ పడటంతో నిబంధనలను అనుసరించి రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఆగస్టులో ఆహ్వానించారు. గుత్తేదారులు పోటీపడి 19.44 శాతం తక్కువ (లెస్) నమోదు చేశారు. అనంతరం 2023 నవంబరు 28న రూ.1,19,97,321తో ఒప్పందం జరిగింది. తొలుత పనులు చేస్తున్న ఉప గుత్తేదారు, ఇంజినీర్లు మధ్య నిర్మాణ సామగ్రి వినియోగంపై వివాదం నడిచింది. దీంతో పనులు నిదానంగా చేపట్టారు. గత నెల 11న జేఈవో వీరబ్రహ్మం ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇటీవల సన్న కంకర పరిచి రోలింగ్ ద్వారా చదును చేశారు. గత నాలుగు రోజులుగా సిమెంటు అచ్చులు పరుస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి రామయ్య క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే నెల 22న రాత్రి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఉన్నతాధికారులు ఇప్పటికే నిర్ణయించారు. రాములోరి పెళ్లి క్రతువును వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. నేలపై కూర్చుని జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులారా వీక్షించడానికి సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నిరుడు తొలి విడతలో 11 వేల చదరపు మీటర్ల మేర చేశారు. మిగతా అసంపూర్తిగా ఉన్న పనులు ఇప్పుడు చేపట్టారు.
ఇలా నిదానంగా చేపడితే బ్రహ్మోత్సవాల్లోపు చేయడం కష్టమే. బిల్లులు సకాలంలో చెల్లిస్తే శరవేగంగా చేస్తామని ఉప గుత్తేదారు ప్రతినిధులు చెబుతున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి ఇంజినీర్లకు బాధ్యతలు అప్పగించారు. వారు తిరుపతి నుంచి తరచూ ఇక్కడికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఒంటిమిట్టలో జరిగే పనులను చూడడానికి ప్రత్యేకంగా ఏఈని నియమిస్తే ఇటీవల ఆయనకు ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పనుల బాధ్యతలను కూడా అప్పగించారు. దీంతో ప్రత్యేకంగా దృష్టి సారించలేకపోతున్నారు. ఉత్సవాల్లోపు పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.





