
దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా విచారణ చేపట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థకు అధికారాలిచ్చేందుకు రూపొందించిన బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా, ఎం ఐ ఎం ఎంపీ అసదుద్దీన్ల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
తొలుత బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ ఓ కేసు విచారణ సందర్భంగా.. ఓ రాజకీయ నాయకుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను గతంలో బెదిరించాడని అన్నారు.
దీనిపై హైదరాబాద్ ఎంపీ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆయన చెప్పిన దానికి ఆధారాలు చూపాలని కోరారు. దీంతో అమిత్ షా స్పందించారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ సభ్యులు అడ్డు తగలడం లేదనీ, అలాగే అధికార పార్టీ వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం వాళ్లు కూడా ప్రశాంతంగా ఉండాలని ఒవైసీని ఉద్దేశించి హెచ్చరించారు.
దీనిపై ఒవైసీ స్పందిస్తూ తనవైపు వేలు చూపించవద్దని, తననెవరూ భయపెట్టలేరని హడావుడి చేశారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ తానెవరినీ భయపెట్టడానికి ప్రయత్నించడం లేదనీ, ఒవైసీ మనసులో భయం ఉంటే తానేమీ చేయలేనని కౌంటర్ ఇచ్చారు. వీరి చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.
అనంతరం ఓవైసీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని జాతివ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని ఆరోపణలు చేశారు. జాతీయవాదులు, జాతివ్యతిరేకులు అని తేల్చేందుకు బీజేపీ దుకాణమేదైనా షురూ చేసిందా అని ఆగ్రహం వెళ్లగక్కారు. బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడే క్రమంలో హోంమంత్రి అమిత్‌షా మావైపు వేలు చూపించి బెదిరించే ప్రయత్నం చేశారని ఆయన కేవలం హోంమంత్రి మాత్రమే. దేవుడు కాదు అని మీడియా ఎదుట తన అక్కసును వెళ్లగక్కారు.