News

మైసూరు సమీపంలో బైటపడ్డ శతాబ్దాల నాటి భారీ నంది విగ్రహాలు – 16 వ శతాబ్దం నాటివంటున్న నిపుణులు

856views

మైసూరు సమీపంలోని అరిసెనెకెరె గ్రామంలో రెండు పురాతన భారీ నంది విగ్రహాలు బయటపడ్డాయి. అరిసెనెకెరె గ్రామంలోని చెఱువులో నీటి అడుగున అనేక శతాబ్దాలుగా రెండు నంది విగ్రహాలు ఉంటుండడం గ్రామంలోని పెద్దలందరూ ఎరిగినదే. ప్రతి వేసవిలోనూ చెరువులో నీటి మట్టం తగ్గినప్పుడు సదరు నంది విగ్రహాల కొమ్ములు దర్శనమిస్తుండేవి. ఎన్నో ఏళ్ళుగా వాటిని వెలికి తీస్తే చూడాలని పెద్దలందరూ ఎదురు చూస్తుండేవారు.

  ఈ మధ్య వేసవి ఎండలకు ఆ చెరువులోని నీరు పూర్తిగా ఎండి పోవడంతో పురాతత్వ శాస్త్రవేత్త ఎం. ఎల్. గౌడ, ఇంజినీర్ సతీష్ ల ఆధ్వర్యంలోని నిపుణుల బృందం పర్యవేక్షణలో గత నాలుగు రోజులుగా ప్రోక్లైనర్లతో త్రవ్వి ఆ నంది విగ్రహాలను వెలికి తీశారు. వాటిలో ఒకటి 15 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉండగా, రెండవది కొంత చిన్నది. తమ ప్రాథమిక పరిశీలనలో సదరు నంది విగ్రహాలు 16, 17 శతాబ్దాలకు చెందినవిగా భావిస్తున్నామని శ్రీ గౌడ తెలిపారు. ఈ నంది విగ్రహాల నిర్మాణానికి ఉపయోగించిన రాతిని బట్టి చూస్తే విజయనగర సామ్రాజ్యం తర్వాతి కాలానికి చెందినవి అయ్యుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.  ఈ సందర్భంగా ఆ గ్రామం పేరు కూడా అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఎందుకంటే “అరిసెనెకెరె” అంటే “రాజు గారి చెఱువు” అనే అర్ధం వస్తుంది.