తన ఆదివాసీలపై దాష్టీకాన్ని చూడలేక బ్రిటిషర్లను ఎదిరించిన విప్లవకారుడు. అమాయకులను అధిక శిస్తుతో వేధిస్తున్న తెల్లవాళ్లపై పోరుబావుటా ఎగరేసిన అడవిబిడ్డ. తన అనుచరులతో కలిసి బ్రిటిష్ కంపెనీ కోశాగారాన్ని దోచుకొని.. దాన్ని పేదలకు పంచిన ఇండియన్ రాబిన్ హుడ్ తిల్కా మాంఝీ. ఆ పేరంటేనే తెల్లదొరలకు సింహ స్వప్నం.
తిల్కా మాంఝీ చేసిన పోరాటం వృథా కాలేదు. భాగల్‌పూర్ వీధుల్లో చిందించబడ్డ ఒక్కొక్క రక్తపుబొట్టు సంతాల్ జాతిలో ఒక్కొక్క విప్లవకారుణ్ణి సృష్టించింది. ఫలితంగా 70 ఏళ్ల తర్వాత 1855 లో ముర్ము సోదరుల నాయకత్వంలో 60 వేల మంది పాల్గొన్న సంతాల్ తిరుగుబాటుకు బాటలు వేసింది. తిల్కామాంఝీ పోరాటానికి భారత ప్రభుత్వం సముచిత గౌరవాన్నిచ్చింది. మాంఝీని ఉరివేసిన చోట అతడి విగ్రహాన్ని నెలకొల్పింది. భాగల్‌పూర్ యూనివర్సిటీ పేరును తిల్కా మాంఝీ భాగల్‌పూర్ యూనివర్సిటీగా మార్చింది.
సంతాల్ తెగకు చెందిన తిల్కా మాంఝీ.. 1750 ఫిబ్రవరి 11న బీహార్‌కు చెందిన సుల్తాన్ గంజ్ తాలూకా తిలక్‌పూర్ గ్రామంలో జన్మించాడు. ఆదివాసీ కుటుంబంలో పుట్టడంతో అడవిపై ప్రేమను పెంచుకున్నాడు. చెట్టూ పుట్టతో అతడికి ప్రత్యేక అనుబంధమేర్పడింది. ఇదిలా ఉండగా, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బలపడింది. అన్నిరంగాల్లో భారతీయుల్ని దోచుకొంటున్నది. ఆ కంపెనీ దృష్టి అడవి బిడ్డలైన సంతాలులపైన పడింది. సంతాలులు పోడు వ్యవసాయం చేసి, పండించుకున్న పంటలను కంపెనీ దోచుకోవడం మొదలు పెట్టింది. ఎదిరించిన సంతాలులను కాల్చేసింది. సంతాలుల ఆడపడుచుల మీద అకృత్యాలకు పాల్పడింది. అదే సమయంలో బెంగాల్ ఘోర కరువు వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం దీనికి భిన్నంగా ప్రజల మీద శిస్తు భారం మోపింది. ఇది సహించలేని యువకుడైన తిల్కా మాంఝీ బ్రిటిష్ కంపెనీ మీద సమర శంఖం పూరించాడు. తనతోటి యువకుల్ని కూడగట్టుకొని 1772లో షానాచార్ అనే ప్రదేశంలో బ్రిటిష్ కంపెనీ మీద తిరుగుబావుటా ఎగరేశాడు. కంపెనీ కోశాగారాన్ని దోచుకొని ఆ సంపదను పేదలకు పంచిపెట్టాడు. దీంతో ఉలిక్కిపడ్డ బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ 800 మందితో కూడిన సైనిక పటాలాన్ని మాంఝీ సేనపైకి పంపాడు.
భాగల్‌పూర్, సుల్తాన్‌గంజ్, రాజ్‌మహల్ తదితర ప్రాంతాల్లో మాంఝీ విప్లవకారులకు, కంపెనీ సిపాయిలకు మధ్య పోరాటం ప్రారంభమైంది. అడవిపై పట్టున్న మాంఝీ సేన ఎదురుదాడిని కంపెనీ సిపాయిలు తట్టుకోలేకపోయారు. ఏమీచేయలేక తోకముడిచారు. బ్రిటిష్ కంపెనీ.. రాజమహల్ ప్రాంతానికి ఆగస్టస్ క్లీవ్‌లాండ్‌ను ఎస్పీగా నియమించింది. క్లీవ్‌లాండ్ నేతృత్వంలో రాజమహల్ అడవుల్లో అణచివేత ఉధృతంగా సాగింది. అయితే, బ్రిటిష్‌వారి ఆయుధసంపత్తి ముందు తాము బాణాలతో ఎంతోకాలం పోరాడలేమని గ్రహించిన మాంఝీ.. గెరిల్ల పోరాటానికి శ్రీకారం చుట్టాడు. తిల్కామాంఝీ గులేర్‌తో ఎస్పీ క్లీవ్‌లాండ్ నుదుటిపై కొట్టగా, అతడు మృతిచెందాడు. క్లీవ్‌లాండ్ మృతితో నిర్ఘాంతపోయిన కంపెనీ అధికారులు కొత్త కుట్రకు తెరతీశారు. మాంఝీ అనుచరుల్లోనీ ఒక నాయకుడిని కోవర్ట్‌గా చేసుకున్నారు. తిలక్‌పూర్ అడవుల్లో మాంఝీ సేన నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి కోవర్ట్ జౌధా తన అనుచరులతో అకస్మాత్తుగా దాడి చేశాడు. ఇందులో కొంతమంది చనిపోయారు.
అయోమయానికి గురైన మాంఝీసేన సుల్తాన్‌గంజ్ పర్వత శ్రేణుల్లోకి పారిపోయింది.. 1785 జనవరి 12న కంపెనీ సైన్యానికి తిల్కా మాంఝీ అనూహ్యంగా చిక్కాడు. అతడిని నాలుగు గుర్రాలకు తాళ్లతో కట్టి భాగల్‌పూర్‌కు ఈడ్చుకొచ్చా రు. మాంఝీ రక్తంతో వీధులన్నీ ఎరుపెక్కా యి. అందరూ చూస్తుండగానే మాంఝీని దారుణంగా హింసించారు. మరుసటి రోజు ఓ మర్రి చెట్టుకు ఉరితీశారు. జాతి ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు అమరుడైన తిల్కా మాంఝీ పేరు చరిత్రలో నిలిచిపోయింది. భారతమాతకు అమరపుత్రుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతాడు.