
ఈ నెల 10వ తేదీ నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై మాఘమాస ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని వైదిక కమిటీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 16న రథసప్తమి పర్వదినం, 20న భీష్మ ఏకాదశి, 24న మాఘపూర్ణిమ వేడుకలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 11, 25, మార్చి 3, 6,10న అరుణపారాయణ, సూర్యోపాసన పూజల్లో భక్తులు పాల్గొనేందుకు వీలైనఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉదయం 8 గంటలకు నిర్వహించే సూర్యోపాసనపూజా రుసుం రూ.1000గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పూజలో పాల్గొన్నఉభయదాతలకు అమ్మవారి దర్శనంతోపాటు శ్రీచక్రార్చన లడ్డూ, శేషవస్త్రం, గోధుమ పొంగలి ప్రసాదాన్ని దేవస్థానం అందజేస్తుందని తెలిపారు.
14న శ్రీ పంచమి వేడుకలు
ఈ నెల 14న చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీపంచమి వేడుకలు నిర్వహించనున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై మూల విరాట్ దుర్గమ్మను సరస్వతీదేవిగా అలంకరిస్తారని తెలిపారు. అమ్మవారి దర్శనం చేసుకున్న విద్యార్థులకు ఉచితంగా పెన్ను, అమ్మవారి ఫొటో, రక్షా కంకణ, కుంకుమ ప్రసాదం అందజేస్తారని పేర్కొన్నారు.





