News

దేవుళ్ల విగ్రహాలపై రసాయనాల ప్రయోగం

330views

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని దొడ్డిపట్ల కేశవస్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహాలతోపాటు శఠగోపం, ఆంజనేయస్వామి విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలు జల్లడంతో గురువారం రాత్రి కలకలం రేగింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా.. ఆలయంలో గర్భగుడి ప్రధాన ద్వారం ఇనుప ఊచలతో ఉండటంతో వాటి మధ్యనున్న ఖాళీల నుంచి కొందరు వ్యక్తులు గురువారం సాయంత్రం కెమికల్‌ పడేటట్లు స్ప్రే చేసినట్లు అర్చకులు నరసింహాచారి గుర్తించారు. ఆలయంలోని ద్వారాలు తెరిచే సరికి దుర్వాసన రావడంతోపాటు విషంతో కూడిన కెమికల్‌ విగ్రహాలపై పడినట్లు ఆయన తెలుసుకున్నారు. విషయాన్ని ఆలయాధికారి ఎన్‌.సతీష్‌కు తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్థానికులతో కలిసి నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలున్నా ఎనిమిది నెలలుగా పనిచేయడం లేదని స్థానికులు నామన శ్రీనివాస్‌ తదితరులు చెబుతున్నారు. భజరంగ్‌దళ్‌ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.