
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ‘హరిత’ చోదక వ్యవస్థ.. భూ కక్ష్యలో విజయవంతంగా తన సత్తా చాటిందని రక్షణ శాఖ తెలిపింది. అంతరిక్ష రక్షణ పరిజ్ఞానంలో ఇది పెద్ద ముందడుగు అని పేర్కొంది. ఈ చోదక వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలెప్‌మెంట్ ఫండ్ (టీడీఎఫ్) కింద రూపొందించారు. దీనివల్ల భూ దిగువ కక్ష్యలో విషతుల్యం కాని, పర్యావరణ అనుకూల చోదక వ్యవస్థను ఉపయోగించడానికి వీలైందని అధికారులు వివరించారు.
ఈ ప్రాజెక్టు కిందట ఒక న్యూటన్ శ్రేణి హరిత మోనోప్రొపెల్లెంట్ థ్రస్టర్‌ను అభివృద్ధి చేశారు. ఈ బాధ్యతను బెంగళూరుకు చెందిన బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టింది. ఈ సంస్థకు డీఆర్‌డీవో మార్గనిర్దేశం చేసింది. ఈ థ్రస్టర్‌ను పీఎస్‌ఎల్‌వీ సి-58 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఒక మైక్రో ఉపగ్రహానికి అమర్చారు. శాటిలైట్‌ను నిర్దిష్ట కక్ష్యలో ఉంచడానికి ఈ ఇంజిన్ సాయపడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ఇస్ట్రాక్ కేంద్రం ద్వారా సేకరించిన దీని డేటాను శాస్త్రవేత్తలు తాజాగా పరిశీలించారు. అన్ని అంశాల్లోనూ ఈ హరిత చోదక వ్యవస్థ తమ అంచనాలకు మించి పనిచేసిందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద దేశీయంగా ఇంధనం, ఫిల్ అండ్ డ్రెయిన్ వాల్వ్‌లు, డ్రైవ్ ఎలక్ట్రానిక్స్ తదితర వ్యవస్థలను అభివృద్ధి చేశారు.





