ArticlesNews

‘‘సామాజిక ప్రజాస్వామ్యం మన జీవిన విధానం కావాలి’’

240views

జనవరి 26 – గణతంత్ర దినోత్సవం ప్రత్యేకం
సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల ఆధిపత్యాన్ని నెలకొల్పుతుంది. స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుందని డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ అన్నారు. వందల సంవత్సరాల విదేశీ దురాక్రమణదారుల పాలన నుండి 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. అనంతరం మనం మన దేశాన్ని పాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవస్థల నిర్మాణం చేసుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుండి అమలు చేసుకున్నాం. అప్పటి నుండి మన దేశాన్ని గణతంత్ర రాజ్యం అని అంటున్నాం. రాజ్యాంగాన్ని అమలులోకి తేవడానికి జనవరి 26 తేదీనే ఎందుకు ఎంచుకున్నాం? 1930 లో జనవరి 26న అప్పటి కాంగ్రెస్ సమావేశం భారత్‌ను గణతంత్ర రాజ్యంగా ప్రకటించి దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం చేసింది. సంపూర్ణ స్వాతంత్ర్య తీర్మానం చేసిన రోజును చారిత్రక దినంగా భావించి మనం 1950లో జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నాం.

భారత రాజ్యాంగం తయారు చేసినప్పుడు రాజ్యాంగ పీఠికలో వేల సంవత్సరాల మనదేశ చరిత్రను గుర్తు చేస్తూ రాముడి కాలం నుండి స్వాతంత్ర్య పోరాటం వరకు ఈ దేశంలో జన్మించిన మహాపురుషుల వివరాలు పొందు పరిచారు. ఒకపక్క మనకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నదని గుర్తు చేస్తూనే మరోపక్క మనం ఇప్పుడిప్పుడే ఒక జాతిగా నిర్మాణమవుతున్నామనే భావనను వ్యక్తం చేశారు. ఈ దేశంలో అనేక మతాలు, సాంప్రదాయాలు వికసించాయి. ఇంకా కొత్తవి వికసిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ వాటన్నింటి మధ్య ఒక సమన్వయం ఉన్నది. సృష్టికర్త పరమేశ్వరుడు ఒక్కడే, అతనిని చేరుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అందుకే ‘సర్వపంథ సమ భావనతో మెలగాలి’, అని పెద్దలు ఏనాడో చెప్పారు. మత సామరస్యం గురించి మన ఆలోచన ఇంత స్పష్టంగా ఉంటే, దేశంలో సామరస్య వాతావరణం నిర్మాణం చేయటానికి ప్రయత్నాలు సహజంగా సాగుతుంటే వాటిని విస్మరించి, 1976లో అప్పటి ప్రభుత్వ పెద్దలు మన రాజ్యాంగంలో ‘సెక్యులర్’ అనే పదం చేర్చి ‘ఈ దేశం సెక్యులర్ దేశం’ అన్నారు. దానికి ఎవరికి వారు వారి స్వలాభం కోసం వారికి తోచిన వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ తన ‘రివ్యూ ఆఫ్ ఫెయిత్’ అనే పుస్తకంలో ‘సెక్యులరిజం అంటే ప్రభుత్వ దృష్టిలో అన్ని మతాలు సమానం. ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యం లేదు అని భావం’ అని రాశారు. కానీ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సెక్యులర్ అంటే హిందూ వ్యతిరేక వాదమనే భావనను పెంచి పోషించారు. మైనార్టీ పేరుతో హిందుత్వం తప్ప మిగతా మతాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వారి పబ్బం గడుపుకుంటున్నారు. దీనితో జాతీయ సమైక్యతకు అవరోధం కలుగుతోంది. ఈ పరిస్థితులను చక్కదిద్దాలి.

డా. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలైన 1950 జనవరి 26న మన పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘‘ఈ దేశం రాజకీయ స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఇక రావలసింది సామాజిక ప్రజాస్వామ్యం. సామాజిక ప్రజాస్వామ్యమనేది ఒక జీవన విధానం. దానిలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే మూడు అంశాలు ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి మమేకమై ఉంటాయి. వీటిని విడదీస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల ఆధిపత్యాన్ని నెలకొల్పుతుంది. స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. సోదర భావం లేని స్వేచ్ఛ, సమానత్వం సహజంగా ఉండలేవు’’, అని అన్నారు.

స్వాతంత్ర్య పోరాట కాలంలో పని చేసిన వారికి ‘ఈ భూమి నా తల్లి’ అనేది ప్రేరణ. ఆ ప్రేరణకు ప్రతిరూపం వందేమాతరం. నేడు మన యువతకు అటువంటి భావాత్మక ప్రేరణ అందించి, మన సంస్కృతి వారసత్వాల పట్ల అభిమానం పెంచాలి. అదే ఈ దేశంలోని అనేక సామాజిక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. తద్వారా ప్రజలలో ఐక్యత నిర్మాణమవుతుంది. అప్పుడు మన దేశం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా నిలబడగలుగుతుంది. అందుకే స్వామి వివేకానంద చెప్పినట్లు భారత మాతను ఆరాధిద్దాం. భారతమాతకు జయం కలగాలని కోరుకుందాం. గణతంత్ర దినోత్సవం రోజున అందరం భారతమాత పూజ చేసి, ఆ తల్లి సేవలో మన జీవితాలను అర్పించాలనే సంకల్పం చేద్దాం.