
జన్మభూమిలో కొలువుదీరిన అయోధ్య రాముడి దర్శనాలకు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ సహచరులు ఎవ్వరూ మార్చి వరకూ అయోధ్యకు వెళ్లాలనే ప్రణాళికలను విరమించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
సామాన్య భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారని, వారికి ఇబ్బంది కలిగించొద్దని ప్రధాని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రులు లాంటి వీఐపీలు వెళ్తే ప్రోటోకాల్స్ కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని ప్రధాని మోదీ సూచించారని సమాచారం. సాధ్యమైనంత మేర ఫిబ్రవరి చివరి వరకూ వాయిదా వేసుకోవాలని, మార్చిలో రామయ్య దర్శనానికి వెళ్తే బాగుంటుందని చెప్పారు. ఆ సమయానికి దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యలో రాముడి దివ్వ స్వరూపాన్ని దర్శించుకుంటారని కేంద్ర మంత్రులకు మోదీ సలహా ఇచ్చారు.
కాగా అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రామమందిర నిర్మాణం జన్మకొకసారి వచ్చే అవకాశం కాదని, జన్మజన్మలకు ఒకసారి వచ్చే అవకాశం అని పేర్కొంది.
శతాబ్దాలుగా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న ప్రజల ఆకాంక్షలను మోదీ నెరవేర్చారని ఆ తీర్మానం కొనియాడింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన మంత్రివర్గ సహచరుల తరఫున మోదీని అభినందిస్తూ తీర్మానాన్ని చదవి వినిపించారు. బుధవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశం ఒక చారిత్రక సమావేశమని ఆయన పేర్కొన్నారు.
దేశంలో క్యాబినెట్ సిస్టం మొదలైనప్పటి నుంచి ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అయోధ్యలో విజయవంతంగా రామాలయ నిర్మాణం జరగడం, ప్రాణప్రతిష్ఠ నిర్వహించడం చరిత్రలోనే ప్రముఖంగా నిలిచిపోతుందని తెలిపారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, దేశ ఆత్మ ‘ప్రాణప్రతిష్ఠ’ 2024 జనవరి 22న జరిగిందని రాజ్‌నాథ్ అభివర్ణించారు.




