News

తీరప్రాంతాల గస్తీకి మరో 14 నౌకలు

293views

భారత తీర రక్షక దళం అంబుల పొదిలోకి వేగవంతమైన మరో 14 గస్తీ నౌకలు (ఎఫ్‌పీవీ) చేరనున్నట్లు రక్షణశాఖ ప్రకటించింది. ఇందుకోసం మజ్‌గావ్‌డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌)తో రూ.1,070 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం వెల్లడించింది. బహుళపాత్రను పోషించే ఈ నౌకలు దేశీయంగా నిర్మాణమై 63 నెలల్లో తీర రక్షణ దళంలో చేరతాయని తెలిపింది.

అధునాతన సాంకేతిక పరికరాలతో పాటు, బహుళ పాత్రను పోషించే డ్రోన్లు, సముద్ర గర్భంలో రక్షించగలిగే వైర్‌లెస్‌ వ్యవస్థ, కృత్రిమ మేధ సామర్థ్యం ఈ ఎఫ్‌పీవీల్లో ఉండనున్నాయంది. నిఘా, అక్రమరవాణా వ్యతిరేక కార్యకలాపాల పట్ల ఎఫ్‌పీవీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. ‘‘సముద్ర భద్రతపై ప్రభుత్వ దృష్టిని బలోపేతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా స్వదేశీ నౌకానిర్మాణ సామర్థ్యాన్ని ఈ ఒప్పందం పెంచుతుంది, సముద్ర ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడంతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాన్ని వృద్ధి చేస్తుంది’’ అని రక్షణశాఖ పేర్కొంది.