
అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలోని ఆలయాల్లో వేడుకలు నిర్వహించారు.
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయపేట పెనుగంచిప్రోలు రామాలయాలలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. స్వామి వారి పాదాల వద్ద స్వర్ణ పుష్పాలను ఉంచి అర్చన చేశారు. శ్రీరామ రథంతో పట్టణంలో రథయాత్ర చేపట్టారు. వేద మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాలు, హరిదాసుల కీర్తనల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి రథయాత్ర కొనసాగింది. శోభాయాత్ర సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో కాషాయ జెండాలను ఊరేగించారు. దీంతో జగ్గయపేటలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ భక్త సమాజం అద్వరంలో 500 మంది భక్తులచే అష్టోత్తర సంఖ్య హనుమాన్ చాలీసా పారాయణం మాన్యు సూక్త హోమం,రామ మూల మంత్ర హోమం, అఖండ అన్న సమారాధన నిర్వహించారు. హనుమాన్ భక్త సమాజం స్తాపించి 50 సంవత్సారాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సమయంలోనే అయోధ్యలో రామ ప్రతిష్ఠ జరగడం శుభపరిణామమని నిర్వాహకులు తెలిపారు.
అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా వాడ వాడలా దేవాలయాల్లో కూడా భక్తుల నోట శ్రీరామ నామస్మరణతో మారమురాగుతుంది. అనకాపల్లి జిల్లాలోని పలు దేవాలయాలలో శ్రీరామచంద్రమూర్తి వారి చిత్రపటాలు ఏర్పాటు చేసి సుందరంగా ఆలయాలు శోభాయమానంగా అలంకరించారు. హిందువుల శతాబ్దాల కల నెరవేరిన వేళ దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో హిందూ పరిషత్, విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నారు.





