News

మత్స్యకార సంక్షేమ సమితి అధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ

119views

గుంటూరు జిల్లా నిజాం పట్నం మండలం కొత్తపాళెం గ్రామంలో మత్స్యకార సంక్షేమ సమితి, మదర్ థెరిస్సా బహుజన సేవా సంస్థ సంయుక్త అధ్వర్యంలో మత్స్యకార మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మత్స్యకార సంక్షేమ సమితి వారు 90 రోజుల పాటు గ్రామంలోని 50 మంది మహిళలకు  కుట్టు మిషన్లలో శిక్షణ ఇచ్చారు.   5/7/19శుక్రవారం నాడు శిక్షణ పొందిన ఆ 50 మంది మత్స్యకార మహిళలకు మదర్ థెరిస్సా బహుజన సేవా సంస్థ సహకారంతో కుట్టు మిషన్లు ఇప్పించారు.

ఈ సందర్భంగా మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కోలంగారి పోలయ్య మాట్లాడుతూ ఇంటికి దీపం ఇల్లాలేనని, ఇల్లాలు ఆర్ధిక స్వావలంబన సాధిస్తే ఆ కుటుంబం అభివృద్ధి పథంలో సాగుతుందని తెలిపారు. వాతావరణ పరిస్థితులపైన ఆధారపడి ఉండే మత్స్యకార వృత్తిలో ఒక్కొక్కసారి పురుషులు కేవలం చేపల వేట ఆధారంగా కుటుంబ అవసరాలకు సరిపడా సంపాదించటం సాధ్యం కాదని, అందువల్ల మహిళలు కుట్టు మిషన్లు, లేదా ఇతర చేతి పనుల ద్వారా సంపాదిస్తే పురుషులకు చేదోడు వాదోడుగా ఉండవచ్చనే ఉద్దేశ్యంతో మత్స్యకార సంక్షేమ సమితి మత్స్యకార మహిళలకు ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. మత్స్యకార సంక్షేమ సమితి ఇక ముందు కూడా ఇలాంటి శిక్షణను మహిళలకు అందిస్తుందని, కనుక ఈ అవకాశాన్ని వీలైనంత ఎక్కువమంది సోదరీమణులు సద్వినియోగం చేసుకుని ఆర్ధిక స్వావలంబనను సాధించాలని కోరారు.  ఉదారంగా మేమున్నామని ముందుకు వచ్చి కుట్టు మిషన్ల కొనుగోలుకు ఆర్ధిక సహకారాన్ని అందించిన మదర్ థెరిస్సా బహుజన సేవా సంస్థ వారిని ఎంత అభినందించినా తక్కువేనని శ్రీ పోలయ్య పేర్కొన్నారు. మదర్ థెరిస్సా బహుజన సేవా సంస్థ నిర్వాహకులకు మత్స్యకార సంక్షేమ సమితి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శులు శ్రీ చిన్ని చిట్టిబాబు, శ్రీ మోపిదేవి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ కన్నా భూశంకర్, మహిళా అధ్యక్షురాలు లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. మదర్ థెరిస్సా బహుజన సేవా సంస్థ నిర్వాహకురాలు రాజ్యలక్ష్మి గారు పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు.