
అయోధ్యలో రామయ్య కొలువుదీరే అపురూప క్షణాలు ఆసన్నమయ్యాయి. మరికొద్ది గంటల్లో ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ లగ్నంలో ఈ వేడుక జరగనుంది. ప్రాణప్రతిష్ఠను 84 సెకన్ల దివ్య ముహూర్తంలో నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే ఈ సమయంలోనే ప్రధాని మోదీ.. విగ్రహ కళ్లకు ఆచ్ఛాదనగా ఉన్న వస్త్రాన్ని తొలగిస్తారు. బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దుతారు. రామ్‌లల్లాకు చిన్న అద్దాన్ని చూపిస్తారు. ఆ తర్వాత 108 దీపాలతో ‘మహా హారతి’ ఇవ్వడంతో ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగుస్తుంది.
ఆలయంపై పుష్పవర్షం..
ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం కురిపించనున్నారు. 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు రెండు గంటల పాటు మంగళ వాయిద్యాలు మోగించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొననున్నారు.
దాదాపు 4 గంటలు మోదీ అయోధ్య సన్నిధిలో..
ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ రామజన్మభూమికి చేరుకుంటారు. ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తయిన తర్వాత భక్తులనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయోధ్యలోని కుబర్ తిలాలో ఉన్న శివ మందిర్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు మోదీ దిల్లీ పయనమవుతారు.





