News

అయోధ్య బాల రాముడి దివ్యరూపమిదిగో..

335views

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. గర్భగుడిలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. అయితే, ప్రాణప్రతిష్ట కంటే ముందే రామ్‌లల్లా విగ్రహం చిత్రాలు బయటకు వచ్చాయి. గర్భగుడిలోకి చేర్చకముందు వీటిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. బాలరాముడి చేతిలో బాణం, విల్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నల్లరాయితో రూపొందించిన ఐదు సంవత్సరాల రాముడి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ విధంగా రామ్‌లల్లా విగ్రహ తొలి దర్శనం ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియాలో ప్రజలకు లభించింది.

ఇక గర్భగుడిలో ప్రధాన వేదికపై ప్రతిష్టించిన తర్వాత కళ్లకు గంతలు కట్టి ఉన్న రామ్‌లల్లా విగ్రహం ఫొటోను విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) విడుదల చేసింది. ప్రాణప్రతిష్ట పూర్తవకపోవడంతో విగ్రహం కళ్ల చుట్టూ పసుపు రంగు వస్త్రం చుట్టారు. రామ్‌లల్లాను గులాబీల దండతో అలంకరించారు. ప్రాణప్రతిష్ట ముగిశాక ఈ నెల 23 నుంచి సామాన్య భక్తులు గర్భాలయంలో రాముడిని దర్శించుకోవచ్చు.

మైసూరు శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ చేతిలో రూపుదిద్దుకొన్న 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని గురువారం గర్భగుడిలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, గర్భగుడిలోకి చేర్చకముందే కళ్లకు ఆచ్ఛాదన లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను ఆలయ ట్రస్టు గానీ, ప్రభుత్వం గానీ అధికారికంగా విడుదల చేయనప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.