
తిరుమలలోని ప్రధాన ప్రాంతాలతో పాటు అలిపిరి వద్ద విమానాశ్రయ స్థాయిలో తనిఖీలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తితిదే చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్‌వో) నరసింహకిశోర్ తెలిపారు. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో డ్రోన్ ఎగురవేసిన వ్యక్తి సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్ స్థాయిలో పనిచేస్తున్న దినేష్‌గా గుర్తించామని చెప్పారు. ఆయన వద్ద ఉన్న నానో ప్లాస్టిక్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని విచారించామని పేర్కొన్నారు. దాన్ని పర్యాటక దృశ్యాలు చిత్రీకరించేందుకు ఎక్కువగా వినియోగిస్తారని, ఆయన వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, డ్రోన్ స్వాధీనం చేసుకుని వాటిలోని డేటాను తొలగించినట్లు వివరించారు. అలిపిరి స్కానింగ్ కేంద్రంలో ప్లాస్టిక్ వస్తువులను గుర్తించే సామర్థ్యం లేదని.. మెటల్, బ్యాటరీలు, పేలుడు పదార్థాలను గుర్తించే వీలుందని వెల్లడించారు. మాడ వీధుల్లోనూ ప్రయోగాత్మకంగా స్కానర్లు ఏర్పాటుచేసి పరిశీలిస్తున్నామని చెప్పారు.





