News

తిరుమలలో డ్రోన్‌ కలకలం

397views

తిరుమలలో భద్రతా నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ను ఎగురవేయడం కలకలం సృష్టించింది. హరియాణాకు చెందిన దినేష్‌ కుటుంబసభ్యులతో కలిసి కారులో తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం కారులో కిందకు దిగుతూ.. 53వ మలుపు వద్ద డ్రోన్‌ను ఎగురవేసి శ్రీవారి మోకాలి మెట్టు, నడకమార్గం, అటవీ ప్రాంతాన్ని చిత్రీకరించడం ప్రారంభించారు. స్థానికులు గుర్తించి అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగురవేయకూడదని సూచించినా పట్టించుకోలేదు. తిరుమలకు వాహనాల్లో అలిపిరి తనిఖీ కేంద్రం గుండానే చేరుకోవాలి. అక్కడి భద్రతా సిబ్బంది వాహనాలు, లగేజీ స్కానింగ్‌ను చేస్తారు. తనిఖీ కేంద్రం మీదుగానే డ్రోన్‌ను తిరుమలకు తీసుకువచ్చి వినియోగించడం కలకలం సృష్టించింది. మొదటి ఘాట్‌రోడ్డులో ఎగురవేసిన తేలికపాటి డ్రోన్‌ను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తితిదే ప్రకటనలో తెలిపింది. ఇది ప్లాస్టిక్‌తో చేసిన డ్రోన్‌ కావడంతో అలిపిరి స్కానింగ్‌ పాయింట్‌లో గుర్తించడం సాధ్యం కాలేదని, ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. డ్రోన్‌తోపాటు సదరు వ్యక్తిని తితిదే విజిలెన్స్‌ అధికారులు తిరుమల పోలీసులకు అప్పగించారు. దినేష్‌ ఆర్మీలో ఎస్పీ స్థాయి అధికారిగా పనిచేస్తున్నట్లు సమాచారం కాగా, నిబంధనలు తెలియక డ్రోన్‌ను వినియోగించానని ఆయన చెబుతుండటం గమనార్హం.