
రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక సమీపిస్తున్న నేపథ్యంలో అయోధ్యలో శ్రీరాముడు, హనుమంతుడి చిత్రాలు, ‘జై శ్రీరాం’ నినాదాలు ఉన్న కాషాయ జెండాలకు డిమాండు బాగా పెరిగింది. జనవరి 22న ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సమక్షంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయ ప్రారంభోత్సవం జరగనున్నందున ఇరుగు పొరుగు జిల్లాల భక్తులు నిర్మాణంలో ఉన్న ఆలయ సందర్శనకు ముందే తరలివస్తున్నారు. 2019లో అయోధ్య ఆలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నాటి నుంచే ఈ జెండాల విక్రయం జోరుగా సాగుతున్నట్లు స్థానిక వ్యాపారులు తెలిపారు. గత కొన్నిరోజులుగా ఈ డిమాండు మరికొన్ని రెట్లు పెరిగినట్లు రామ్‌పథ్‌లో రెస్టారెంటు నిర్వహిస్తున్న ప్రదీప్ గుప్తా చెప్పారు. గతంలో ఈ జెండాలను ఇళ్ల మీద ఎగురవేసేవారు కాదని, ఇపుడు ఎటుచూసినా ఆ దృశ్యాలేనని అన్నారు.
రెండు వైపులా అడ్డుగా ఉన్న దుకాణాలను తొలగించి 13 కి.మీ.ల మేర పునరుద్ధరించిన రామ్‌పథ్‌కు ఇటూ అటూ పాదచారుల నడక మార్గాల నిండా ఈ జెండాల విక్రేతలే కనిపిస్తున్నారు. కాషాయ జెండాల ధరలు రూ.50 నుంచి రూ.వెయ్యి దాకా ఉంటున్నాయి. గత కొన్ని వారాలుగా పలుచోట్ల జరుగుతున్న శోభాయాత్రలతోనూ జెండాల అమ్మకాలు మరింత పెరిగాయని వ్యాపారులు తెలిపారు. హోల్‌సేల్ ధరలకు అమ్ముతున్నా రోజుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు సంపాదిస్తున్నట్లు దుకాణదారు ముకేశ్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. డిసెంబరు 30న అయోధ్యలో జరిగిన ప్రధాని మోదీ రోడ్‌షోలోనూ కాషాయ జెండాలు నగరమంతటా రెపరెపలాడాయి. పొరుగున ఉన్న జౌన్‌పుర్ జిల్లా నుంచి విచ్చేసిన స్థానిక ప్రజాప్రతినిధి రాజ్‌కుమార్ దుబే పెద్ద మొత్తంలో జెండాలు కొనుగోలు చేశారు. వీటిని గ్రామాల్లో పంచుతామని ఆయన తెలిపారు. కాషాయ జెండాలతోపాటు అయోధ్య రామమందిర చెక్కబొమ్మలు, రింగులు, లాకెట్ల వంటివి విపరీతంగా అమ్ముడుపోతున్నాయి.





