
మరో రెండు వారాల్లోనే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న సమయంలో అయోధ్యకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ వెల్లడించారు. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని, అంతకు ముందే హెలికాప్టర్ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు.
‘అయోధ్య నగరానికి వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు ప్రారంభం కానున్నాయి. మేము వాటర్‌వేస్ సేవలను కూడా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం.. .విమానాశ్రయ సర్వీసులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.’ అని చెప్పారు. అలాగే, ప్రారంభోత్సవ వేడుకలను తిలకించేందుకు నగరానికి తరలివచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
నగరానికి సందర్శకుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగనున్న దృష్ట్యా రైల్వేల సామర్థ్యాన్ని కూడా పెంచుతామని చెప్పారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకలు జనవరి 16 నుంచి మొదలు కానున్నాయి. గర్బాలయంలో బాల రాముడి విగ్రహాన్ని జనవరి 22న ప్రతిష్ఠిస్తారు.
డిసెంబరు 30న అయోధ్యలో విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌లను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణప్రతిష్ఠ రోజున ప్రతి ఇంట శ్రీరామ జ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు.





