
అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి పూజిత అక్షింతలను రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నారు. వాటిని ఇంట్లో పెట్టి పూజలు చేసుకోవాలని, ఈ నెల 22న అయోధ్యలో జరిగే పూజల సందర్భంగా అక్షింతలకు పూజలు చేసి తలపై వేసుకోవాలని సూచిస్తున్నారు.
అయోధ్య రామమందిరంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వచ్చిన అక్షింతలను బీజేపీ మైనారిటీ మోర్చ అధ్వర్యంలో విజయవాడలో ప్రజలకు పంపిణీ చేశారు. అంతకుముందు ప్రజలతో కలిసి బిజెపి నాయకులు చుట్టుగుంట గణపతి ఆలయంలో అక్షింతలతో ప్రదక్షిణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ భక్త బృందం ప్రతినిధి మాట్లాడుతూ. అయోధ్యలో శ్రీ సీతారాములను పూజించిన అక్షతలు పవిత్రంగా స్వీకరించి నిత్యం పూజలు చేసి, వాటితో పాటు సీతారాముల చిత్రపటం, అయోధ్య రామయ్య ఆహ్వాన పత్రం, స్వామివారి ఆశీర్వచనం ఇంటింటికి ప్రసాదంగా అందిస్తున్నట్లు తెలిపారు. భజనలు చేస్తూ, పాటలు పాడుతూ ఇంటింటికి అక్షతలు ఇస్తున్నామన్నారు.

వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో స్థానిక మేదరవీధి, శంకరరావువీధి, శ్రీరాములపేటలో గురువారం అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను 13వ వార్డు ఇన్చార్జ్ నరేష్ కుమార్, ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ సీవీ జయలక్ష్మి పంపిణీ చేశారు. వార్డులోని అన్ని ఇళ్లు తిరుగుతూ అందరికీ అక్షింతలను, స్వామివారి చిత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఆంజనేయులు, భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అయోధ్యలోని శ్రీరామ చంద్రస్వామి వారి అక్షింతలను కృష్ణా జిల్లా పామర్రు ఇంటింటికీ పంపిణీ చేసినట్టు విశ్వహిందూ పరిషత్ పామర్రు మండల అధ్యక్షుడు అరిగెల బాలుడు తెలిపారు.

విశాఖలోని జోడుగుళ్లపాలెం ప్రాంతంలో అయోధ్య బాలరాముని స్పర్శ అక్షింతల పంపిణీ కార్యక్రమం జరిగింది. బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమ్మిడి సుజాత రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి పాల్గొన్నారు. భవ్య రామమందిరం ప్రారంభోత్సవం రూపంలో ఈనెల 22 వ తేదీన నెరవేరుతుందని అన్నారు






