
313views
దీక్ష విరమణ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి వేలాదిగా వస్తున్న భవానీలు పరిసరాలు శుభ్రంగాలేక ఇబ్బంది పడుతున్నారు. సమ్మె నేపథ్యంలో పారిశుద్ధ్య పనులకు కార్మికులెవరూ రావడం లేదు. దీంతో ఆలయ పరిసరాలు, కనకదుర్గానగర్, కృష్ణవేణి ఘాట్, కల్యాణకట్ట పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారాయి. భవానీలు ఇరుముడులు దించే ప్రదేశంలో చెత్త పేరుకుపోయింది. పవిత్రమైన ఇరుముడి బియ్యాన్ని నేలపై తొక్కుతున్నారు. భవానీలు స్నానాలు చేసే కృష్ణవేణి ఘాట్ పరిసరాలు దుర్వాసన వస్తున్నాయి. తలనీలాలు, భవానీలు విడిచిన దుస్తులన్నీ ఘాట్ మెట్లపై కుప్పలుగా పడిఉన్నాయి. అందరూ వాటిని తొక్కుకుంటూ వెళ్లి జల్లుస్నానాలు చేసి రావాల్సిన దుస్థితి నెలకొంది. ఆలయ అధికారులు వెంటనే స్పందించి దుర్గగుడి పరిసరాలను పరిశుభ్రంగా చేయించాలని భక్తులు కోరుతున్నారు.





