News

ఆధ్యాత్మిక కేంద్రం.. ఆంధ్రా అరుణాచలం

335views

తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలం. అక్కడ అపీతకుచాంబ సమేతుడై స్వయంభువుగా వెలసిన అరుణాచలేశ్వరుడిని ఎంతో మంది భక్తులు దర్శించుకుంటారు. అక్కడి భగవాన్‌ రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకుని.. ఆయన చూపిన బాటలో పయనిస్తూ మోక్ష సాధనకు కృషి చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. జీవితంలో ఒక్కసారైనా తిరువణ్ణామలై వెళ్లి, గిరి ప్రదక్షిణ చేయాలని తపిస్తున్నవారు ఎందరో. అటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని తలపించేలా.. ఆంధ్రా అరుణాచలంగా భాసిల్లుతోంది ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీ రమణ సేవాశ్రమం. ఇది ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతూ.. మూడు దశాబ్దాలుగా అనేక మందిని ఆధ్యాత్మిక పథంలో నడిపిస్తోంది. రమణ మహర్షి మార్గంలో పయనిస్తూ సంఘహిత కార్యక్రమాలు చేపడుతోంది. సత్సంగం, సేవ అనే రెండు సాధనాలతో మానవ సంబంధాలను బలోపేతం చేసేందుకు త్రికరణ శుద్ధిగా నిరంతర కృషి చేస్తోంది.

పునాది పడిందిలా..

రాచపల్లికి చెందిన కవల బ్రహ్మచారులు రమణానంద, లక్ష్మణానందలు ఆధ్యాత్మిక సాధన చేస్తున్న క్రమంలో రమణ మహర్షి బోధనలకు ఆర్షితులయ్యారు. వీటి ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో భక్తుల విరాళాలతో 1990 ఆగస్టు 15న 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకుని రాచపల్లి సమీపాన నాలుగెకరాల స్థలాన్ని సమకూర్చుకుని, ఈ ఆశ్రమం ఏర్పాటు చేశారు. రమణ మహర్షి ప్రధాన ఆలయం, ధ్యాన మందిరం నిర్మించారు. ‘ఈ ఆశ్రమాన్ని ఆనుకొని శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి ఆలయాన్ని, దక్షిణామూర్తి, గణపతి, కుమారస్వామి ఉపాలయాలను కూడా నిర్మించారు. క్రమంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అంధ్రా అరుణాచలంగా తీర్చిదిద్దారు.

నేడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు

రమణ మహర్షి 144వ జయంతి వేడుకలు శనివారం ఆశ్రమంలో నిర్వహిస్తున్నారు. దీనికోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. 15 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సత్యసాయి సేవా సంస్థలు సహా పలు స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సహకారంతో, ఆధ్యాత్మిక వెలుగులతో రమణ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. శనివారం సుప్రభాత సేవ, అఖండజ్యోతి ప్రజ్వలన, సమష్టి ధ్యానం, ఉపనిషత్‌ పారాయణ, ప్రణవ పతాక ప్రతిష్ఠాపన, గోపూజ, రమణ అష్టోత్తర శతనామావళి అర్చన, లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తారు. అనంతరం ఆధ్యాత్మిక సభ జరుగుతుంది.

ఆధ్మాత్మికత, సేవా భావం పెంపొందించడమే లక్ష్యం
సీతానగరం మండలం వంగలపూడిలోని శ్రీ సద్గురు సేవాశ్రమంలో సాధనకు వెళ్లినప్పుడు రమణ మహర్షి తత్వం తెలుసుకుని ప్రేరణ పొందాం. దాతల సహకారంతో రాచపల్లి అడ్డురోడ్డు వద్ద రమణ సేవాశ్రమాన్ని నెలకొల్పాం. సేవ, సత్సంగం సాధనాలుగా సమాజ వికాసం దిశగా భక్తులకు ప్రేరణ కల్పించడమే లక్ష్యంగా నిర్దేశించుకొన్నాం. మానవ బంధాలు బలపడేలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– స్వామి రామానంద