
భారత నౌకాదళం అడ్మిరల్ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను తాజాగా విడుదల చేసింది. మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని ఇవి ప్రతి బింబిస్తాయని నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. అడ్మిరల్, వైస్ అడ్మిరల్ , రియర్ అడ్మిరల్లకు సంబంధించి మొత్తం అయిదు బ్యాడ్జీలను నౌకాదళం ఆవిష్కరిం చింది. భుజానికి ధరించే ఈ బ్యాడ్జీ అధికారి స్థాయిని సూచిస్తుంది. బ్యాడ్జీపై ఎరుపు రంగులో అష్టభుజి ఆకారంలోని చిహ్నం ఎనిమిది దిక్కుల్లో నౌకాదళ దార్శనికతకు ప్రతీక. ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజ ముద్ర నుంచి స్ఫూర్తి పొంది దీన్ని రూపొందించారు. అష్టభుజాకారం మీద ‘నౌకాదళ చిహ్నం’తో కూడిన బంగారు గుండీ పొందుపర్చారు. బానిస మనస్త త్వాన్ని వదిలించుకోవాలనే సంకల్పాన్ని ఇది చాటుతుంది. కింద ఖడ్గం, టెలిస్కోపు ఉన్నాయి. భారత సరికొత్త శక్తిసామర్థ్యాలను, యుద్ధాల్లో ఆధిపత్యాన్ని ఖడ్గం సూచిస్తుంది. టెలిస్కోపు దూరదృష్టిని ప్రతిబింబిస్తుంది. అధికారుల ర్యాంకును బట్టి నక్షత్రాల సంఖ్య, బ్యాడ్జీ అంచు రంగు ఉంటాయి.
గతేడాదిసెప్టెంబరులో ప్రధాని మోదీ భారత నౌకాదళ సరి కొత్త చిహ్నాన్ని (నిశాన్) ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అంతకుముందున్న గుర్తు దేశ వలసవాద గతాన్ని గుర్తు చేసేలా ఉందని కేంద్రం భావించింది. ఈ క్రమంలోనే మన చరిత్ర నుంచి స్ఫూర్తి పొందేలా కొత్త చిహ్నాన్ని తీసుకొచ్చింది. సముద్ర జలాలు, తీరా లపై ఆధిపత్యం చెలాయించిన భారత రాజుల్లో శివాజీ ఒకరు. ఆయన అత్యంత విశ్వసనీయమైన నౌకాదళాన్ని నిర్మించారు. ఇందులో 60 యుద్ధనౌకలు, దాదాపు 5 వేలమంది సైన్యం ఉండేవారని నేవీ గతంలో ఓ వీడియో ద్వారా తెలిపింది. భారత తీర రక్షణలో ఈ దళం అత్యంత కీలకంగా పనిచేసింది.





