News

పీఎస్‌ఎల్‌వీ అనుసంధానం పూర్తి

301views

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌(శ్రీహరికోట) నుంచి జనవరి ఒకటిన పీఎస్‌ఎల్‌వీ-సి58 రాకెట్‌ ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు చురుగ్గా పనులు చేస్తున్నారు. ఇప్పటికే షార్‌లోని మొదటి ప్రయోగ వేదికలో పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక అనుసంధానం పూర్తయింది. వివిధ తనిఖీలు సైతం నిర్వహించారు. ఈ రోజు రిహార్సల్‌ జరగనుంది. అనంతరం ప్రీ కౌంట్‌డౌన్‌ ప్రారంభమవుతుంది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభిస్తారు. ఇది నిరంతరాయంగా 25 గంటలపాటు కొనసాగాక పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక సోమవారం ఉదయం 9.10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. రాకెట్‌ సన్నద్ధత సమావేశం షార్‌లో ఈ రోజు నిర్వహించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ మనదేశానికి చెందిన 480 కిలోల ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. వాహకనౌకలోని పీఎస్‌4లో ఐదు పేలోడ్స్‌ను పంపుతున్నారు. వీటి ద్వారా వివిధ పరిశోధనలు చేపట్టనున్నారు. ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహం జీవితకాలం ఐదేళ్లు. ఎక్స్‌ కిరణాల ధ్రువనాన్ని అధ్యయనం చేయడానికి ఉపగ్రహాన్ని పంపుతున్నారు. జనవరి చివర్లో జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం చేసేందుకు కూడా చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.