News

రామ హారతికి రారండి ; అయోధ్యలో 700 లాకర్ల ఏర్పాటు

298views

ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి హాజరవ్వాలంటూ రామ భక్తులకు ఆలయ ట్రస్టు ఆహ్వానం పలికింది. ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న పాసులను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచింది. ప్రారంభోత్సవం అనంతరం ప్రతిరోజూ త్రిసంధ్య (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం)లలో హారతి కార్యక్రమం ఉంటుందని ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. భక్తులకు ఉచితంగానే ఈ పాసులను అందిస్తున్నారు. ప్రతి హారతి కార్యక్రమానికి 30 మంది భక్తులకు అవకాశం ఉంటుందని సంబంధిత విభాగం మేనేజర్‌ ధ్రువేశ్‌ మిశ్ర స్పష్టం చేశారు. ‘‘ఉదయం శృంగార హారతి, మధ్యాహ్నం భోగ హారతి, సాయంత్రం సంధ్యా హారతి నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లోనూ ఈ సేవ అందుబాటులో ఉంది. రామజన్మభూమి అధికార వెబ్‌సైట్‌లో హారతి పాసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడి వచ్చి కేంద్రంలో పాసులు తీసుకొని హారతికి వెళ్లొచ్చు’’ అని మిశ్ర వివరించారు.

రూ.11 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో అయోధ్యలో ఈ నెల 30న రూ.11,100 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం, ఆధునికీకరించిన రైల్వే స్టేషను, రెండు నూతన అమృత్‌ భారత్‌, ఆరు వందే భారత్‌ రైళ్లను ఆరంభించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం గురువారం వెల్లడించింది.

అయోధ్యలో 700 లాకర్ల ఏర్పాటు

భక్తులు తమ వస్తువులను భద్రపరుచుకునేందుకు వీలుగా అయోధ్య ఆలయ పరిసరాల్లో లాకర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 700కు పైగా లాకర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. లగేజీ భద్రపరుచుకునేందుకు సైతం కేంద్రాలను ఏర్పాటు చేశారు.

భదొహీ తివాచీలు

ప్రపంచ ప్రసిద్ధి చెందిన భదొహీ తివాచీలు, కుడ్య అలంకరణాలు రామమందిరంలో కొలువుతీరనున్నాయి. చేతితో నేసే ఈ భదొహీ తివాచీలను మందిరం హాలు, గ్యాలరీలో పరచనున్నారు. అదేవిధంగా ఆరు నుంచి ఎనిమది అడుగుల పొడవు వెడల్పుతో ఎనిమిది కిలోల బరువుండే కుడ్య అలంకరణలను ఆలయ ఆవరణలోని గోడలకు అమర్చనున్నారని కలెక్టర్‌ గౌరంగ్‌ రాఠి వెల్లడించారు.

భారీగా వెలిసిన పోస్టర్లు

భవ్య రామమందిరం, నూతన విమానాశ్రయ చిత్రాలతో కూడిన భారీ పోస్టర్లు అయోధ్య నగరమంతటా వెలిశాయి. వాటిపై అయోధ్య.. ‘మర్యాద, ధర్మం, సంస్కృతు’లకు ప్రతీక అంటూ సందేశాలను పొందుపరిచారు.