News

పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళ

263views

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ జాతీయ అసెంబ్లీతో పాటు ప్రావిన్షియల్‌ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ పోటీ చేస్తుండటం విశేషం. ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని బునేర్‌ జిల్లా నుంచి డాక్టర్‌ సవీరా పర్కాశ్ ఎన్నికల బరిలోకి దిగారు. పీకే-25 స్థానానికి ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు.

జనరల్‌ స్థానాల్లో తప్పనిసరిగా ఐదు శాతం మహిళా అభ్యర్థులు ఉండాలంటూ పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం ఇటీవల కీలక సవరణలు చేసింది. ఈ క్రమంలోనే బునేర్‌ జిల్లాలోని జనరల్‌ స్థానం నుంచి పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP) టికెట్‌పై సవీరా పోటీ చేస్తున్నారు. బునేర్‌ నుంచి సార్వత్రిక ఎన్నికలకు పోటీ చేస్తున్న తొలి మహిళ కూడా ఈమే కావడం విశేషం.

ఇంతకీ ఎవరీ సవీరా పర్కాశ్..?

ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని అబోటాబాద్‌ ఇంటర్నేషనల్‌ మెడికల్‌ కాలేజీ నుంచి సవీరా పర్కాశ్ 2022లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఆమె తండ్రి ఓం పర్కాశ్ రిటైర్డ్‌ డాక్టర్‌. గత 35 ఏళ్లుగా ఓం పర్కాశ్.. బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వం వహిస్తున్న పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లోనే సవీరా కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె.. బునేర్‌లో పీపీపీ మహిళా విభాగానికి జనరల్‌ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 28,600 మంది పోటీ చేస్తుండగా ఇందులో దాదాపు 3000 మంది మహిళలున్నారు. అయితే, హిందూ కమ్యూనిటీకి చెందిన ఏకైక మహిళ సవీరానే. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బునేర్‌ నుంచి ఆమె పోటీ చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆమెకు పలువురు హక్కుల కార్యకర్తలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మద్దతు ప్రకటిస్తున్నారు.