News

సరిహద్దుల్లో ఉగ్రవాదుల భారీ చొరబాటును భగ్నం చేసిన భద్రతా దళాలు

284views

జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తీవ్ర అలజడి చోటుచేసుకుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. చిమ్మచీకట్లో చొరబాటుకు యత్నించిన ముష్కరులను తరిమికొట్టాయి. ఈ మేరకు ఆర్మీ అధికారులు శనివారం వెల్లడించారు.

అఖ్నూర్‌లోని ఖోర్‌ సెక్టార్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలతో అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు యత్నించారు. నిఘా పరికరాల సాయంతో వీరిని గుర్తించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై కౌంటర్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ముష్కరులపై కాల్పులు చేపట్టారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతిచెందినట్లు తెలుస్తోంది.

పూంఛ్‌ సెక్టార్‌లో 30మంది ఉగ్రవాదులు

భద్రతా సిబ్బంది కాల్పులతో ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ మృతదేహాన్ని మిగతా ముష్కరులు తమతో పాటు లాక్కెళ్లినట్లు తెలిపారు. కాగా.. జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న భీకర ఉగ్రదాడి వేళ.. ఉగ్రవాదుల చొరబాటు ఘటన కలకలం రేపింది.

పూంఛ్‌ జిల్లాలో జవాన్లను తరలిస్తున్న సైనిక వాహనాలపై పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా దళాలు ముమ్మర వేట సాగిస్తున్నాయి. మరోవైపు, పూంఛ్‌ సెక్టార్‌లో దాదాపు 25 నుంచి 30 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు నక్కినట్లు భారత సైన్యం అంచనా వేస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి దాదాపు 300 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని, వారంతా భారత్‌లో చొరబాటుకు వేచి చూస్తున్నారని ఇటీవల బీఎస్‌ఎఫ్‌ ఐజీ అశోక్‌ యాదవ్‌ కూడా వెల్లడించారు.