
నియో – జమాతుల్ – ముజహిద్దిన్ (JMB) తీవ్రవాద సంస్థ కార్యకలాపాలతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులను కలకత్తా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు బంగ్లాదేశ్ కు చెందిన వారు కాగా, ఒకరు భారతీయ పౌరుడు కావడం గమనార్హం. మొహమ్మద్ జియావుర్ రెహ్మాన్, మమోనుర్ రషీద్ అనే ఉగ్రవాదులిద్దరినీ కలకత్తాలోని సియాల్డా రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేయగా మొహమ్మద్ సాహిన్ ఆలం మరియు రోబి ఉల్ ఇస్లాం అనే మరో ఇద్దర్ని హౌరా స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి జిహాది సాహిత్యం తోపాటు జిహాది ఉద్యమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉన్న మొబైల్ ఫోనును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు నలుగురూ సామాజిక మాధ్యమాలలో చురుగ్గా ఉంటూ వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్లలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసి షరియా చట్టానికి అనుకూలమైన మత రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో వారు పని చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది.






