
255views
అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)లో హిందూ అమెరికన్ల ప్రయోజనాలను కాపాడటానికి, వారి సమస్యలను లేవనెత్తడానికి హిందూ కాకస్‌ను ఏర్పాటు చేసినట్లు రిపబ్లికన్ పార్టీ చట్టసభ సభ్యులు పీట్ సెషన్స్, ఎలిసి స్టెఫానిమ్ మంగళవారం ప్రకటించారు. సెషన్స్, స్టెఫానిమ్‌ల అధ్యక్షతలో ఈ కాకస్ హిందూ అమెరికన్లకూ, విధానకర్తలకూ మధ్య కీలక వారధిగా నిలుస్తుంది. భారత్, నేపాల్, శ్రీలంక, ఇండోనేసియా, బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బ్రిటన్, నెదర్లాండ్స్‌లకు చెందిన హిందూ అమెరికన్లకూ కాకస్ ప్రాతినిధ్యం వహిస్తుంది. హిందువులతోపాటు భారత సంతతికి చెందిన సిక్కులు, బౌద్ధులు, జైనుల ప్రయోజనాలనూ కాపాడుతుంది. అమెరికాను భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సజీవ సమాజంగా తీర్చిదిద్దడానికి హిందూ కాకస్ క్రియాశీల పాత్ర పోషిస్తుందని పత్రికా ప్రకటనలో కాకస్ తెలిపింది.





