ArticlesNews

భక్తాగ్రేసరుడు, సంఘ సంస్కర్త, హరిజన పద సృష్టికర్త ‘‘నర్సింహ మెహతా’’

331views

భక్తి అంటే భగవంతుడిని త్రికరణ శుద్ధిగా ప్రేమించడం. భక్తుడు భగవంతుడికి దాసుడైతే, ఆ భగవంతుడు భక్తికి దాసుడవుతాడు. తనను పట్టుకున్నవారిని తానెప్పుడూ విడువడు. భక్తులంటే భగవంతుడికి ప్రాణం. నిష్కల్మషమైన మనసున్న భక్తులను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు. తన కోసం ఆయన ఏదైనా చేస్తాడు. భక్తి మార్గంలో బ్రహ్మానందాన్ని పొంది బృందావనంలో తన దివ్య నేత్రాలతో శ్రీకృష్ణుని రాసలీలలను చూసిన మహాసాధకుడు నర్సింహ మెహతా.

భారతదేశపు మధ్య యుగాలలో సాగిన భక్తి ఉద్యమం సమాజంలో ఎంతో మార్పును తీసుకువచ్చింది. అలాంటి సమయంలో గుజరాత్‌లోని తలాజా అనే ఊరిలో జన్మించారు. నర్సింహ మెహతా తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో జనాగఢ్‌లో అన్న వంశీధరుడి ఇంట పెరిగారు. నర్సింహకు చిన్ననాటి నుంచే శ్రీకృష్ణుడు అంటే మహా ప్రేమ. నిరంతరం కృష్ణ నామాన్ని జపిస్తూ ఆయన లీలలను స్మరించుకుంటూ మైమరచిపోయేవాడు. చదువుకోమని బడికి పంపిస్తే తోటి పిల్లలందరినీ తోటకు తీసుకెళ్లి శ్రీకృష్ణుని లీలలన్నింటినీ పిల్లలందరికీ కథలు కథలుగా చెప్పేవాడు. వారందరి చేతా కృష్ణ భజన చేయించేవాడు.

నర్సింహ మెహతా బడి మానేయడంతో పాటు తోటి పిల్లలను సైతం మాన్పిస్తున్నాడని తెలియడంతో వారి తల్లిదండ్రులు మెహతా వదినకు ఫిర్యాదు చేశారు. ఆమె కోపోద్రేకురాలై మెహతాను చివాట్లు పెట్టింది. దీంతో ఆయన ఇల్లు వదిలి సమీప అడవిలోని శివాలయానికి చేరుకున్నాడు. శివలింగాన్ని హత్తుకొని శ్రీకృష్ణుడిని చూపించాలని విలపించాడు. మెహతా కన్నీటికి శివలింగం కరగలేదు కానీ అందులోని శివుడు మాత్రం నీరైపోయాడు. వెంటనే నర్సింహ మెహతాకు దర్శనమిచ్చాడు ఆ పరమేశ్వరుడు. స్వయంగా తన ఒడిలో మెహతాను చేర్చుకొని అతడిని బృందావనానికి తీసుకుపోయాడు. అక్కడ తన దివ్య నేత్రాలతో శ్రీకృష్ణుని రాసలీలలను చూసి వేణుగానానికి చలించి పోయాడు. నాటి నుంచి ఆయన మనసు పూర్తిగా శ్రీకృష్ణుని మీద లగ్నమైపోయింది. ఆయన మీద భజనలు రాస్తూ, ఆయన లీలలను కీర్తిస్తూ కాలం గడిపాడు.

నర్సింహ మెహతాకు యుక్త వయసు రావడంతో పెళ్లి చేశారు. అయినా మార్పు రాలేదు. అతని భార్య కూడా మెహతా చూపించిన భక్తిమార్గంలోనే మునిగిపోయింది. నీ భక్తి బాగానే ఉంది కానీ కాస్త బాధ్యతలను కూడా పట్టించుకో అని నర్సింహ మెహతాను అంతా హెచ్చరించేవారు కానీ అంతా ఆ శ్రీకృష్ణుడే చూసుకుంటాడని మెహతా వారికి చిరునవ్వుతో సమాధానమిచ్చేవాడు. నిజంగానే అతని బాగోగులను శ్రీకృష్ణుడే చూసుకునేవాడని తెలియజేసే ఘటనలు మెహతా జీవితంలో చాలానే జరిగాయి. ఒక సందర్భంలో మెహతా కుమార్తెను కాపురానికి పంపేందుకు అవసరమయ్యే వ్యయాన్ని సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడే ఒక ధనికుని రూపంలో అందించాడు. గుజరాతీ భాషలో కృష్ణలీలలనూ, ఆ కృష్ణభక్తిలో తాను పొందిన అనుభవాలను నర్సింహ మెహతా వర్ణించడమే కాదు..ఆ భాషలో భజనలను రాయడంలోనూ ఆద్యుడయ్యాడు. అందుకే ఆయన గుజరాతీ భాషకు ఆదికవిగా వినూతికెక్కారు. శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ ఆయన 22 వేలకు పైగా కీర్తనలు స్వరపరిచారు.

నర్సింహ మెహతా కేవలం భక్తుడు మాత్రమే కాదు సంఘ సంస్కర్త కూడా. తన రచనలతో ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని నింపడమే కాకుండా తామంతా ఒక్కటే అనే ఐక్యతా భావనను కలిగించారు. గాంధీజీ కంటే ఎంతో కాలం ముందుగానే ఆయన గుజరాత్‌లో కుల వివక్ష, అస్పృశ్యతలకు వ్యతిరేకంగా గళమెత్తారు. తన రచనల ద్వారా సామాజిక పరివర్తనకు పాటుపడ్డారు. గాంధీజీకి ఎంతో ఇష్టమైన, అనధికార జాతీయ గీతం హోదా పొందిన ‘వైష్ణవ జనతో..’ కీర్తనను స్వరపరిచింది నర్సింహ మెహతానే. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలను హరిజనులు అని పిలిచే ఆలోచన నర్సింహ మెహతా స్ఫూర్తితోనే గాంధీకి కలిగింది. తన గీతాలలో మొదటగా ‘హరిజన్’ అనే పదాన్ని నర్సింహ మెహతా ఉపయోగించారు. గుజరాతీ ఆదికవి స్ఫూర్తితోనే గాంధీజీ తన వార పత్రిక ‘యంగ్ ఇండియన్’ పేరును ‘హరిజన్’‌గా మార్చారు. 1932 స్థాపించిన అస్పృశ్యతా వ్యతిరేక లీగ్ పేరును ‘హరిజన్ సేవక్ సంఘ్’‌గా మార్చడం వెనుక కూడా నర్సింహ మెహతా స్ఫూర్తియే దాగి ఉంది. ఇప్పటికీ జునాగఢ్‌లో నర్సింహ మెహతా సత్సంగాలను నిర్వహించిన ప్రదేశాన్ని ‘నర్సింహ మెహతా నొ చోరో’ పేరిట భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఆయన రాసిన భజనలు ఉన్నంతకాలమూ మెహతా భక్తి నిలిచి ఉంటుంది. గాంధీకే కాదు మరెందరో మహాత్ములుగా మారేందుకు స్ఫూర్తినిస్తుంది.