
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలను తితిదే శనివారం ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం ఈ నెల 18న ఉదయం 10గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 21న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటా విడుదల చేస్తారు. అదే సమయంలో శ్రీవారి తెప్పోత్సవాల టికెట్లను అందుబాటులో ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార వర్చువల్ సేవలకు సంబంధించిన టికెట్లు, దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.
• 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.
• 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటా విడుదల చేస్తారు.
• భక్తులు వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తితిదే కోరింది.
23నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారదర్శనం
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం గుండా భక్తులకు దర్శనం కల్పించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది. టోకెన్లు కలిగిన భక్తులనే తిరుమలకు అనుమతించనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లను తితిదే జారీచేసింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు పరిమితంగా బ్రేక్ దర్శనం ఇస్తారు. సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని తితిదే తెలిపింది.





