News

‘ఐఎన్‌ఎస్‌ తర్ముగ్లీ’ సేవలు పునఃప్రారంభం

182views

తూర్పు నౌకాదళానికి చెందిన విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డులో ‘ఐఎన్‌ఎస్‌ తర్ముగ్లీ’ యుద్ధనౌక సేవలు గురువారం పునఃప్రారంభించారు. కార్యక్రమానికి భారత నౌకాదళం మెటీరియల్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సందీప్‌ నైతానీ హాజరై మాట్లాడారు. ‘ఫాస్ట్‌ అటాక్‌ క్రాఫ్ట్‌(ఎఫ్‌ఏసీ)’గా పేరొందిన ఈ నౌకను తొలుత గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డ్‌ ఇంజినీర్స్‌ సంస్థలో నిర్మించారని, కొన్నేళ్ల పాటు దేశరక్షణకు సేవలు అందించిన తర్వాత 2006లో భారత ప్రభుత్వం.. మాల్దీవ్‌ జాతీయ రక్షణ దళం (ఎంఎన్‌డీఎఫ్‌)కు కానుకగా అందజేసిందన్నారు.

ఈ ఏడాది మేలో భారత్‌కు తిరిగొచ్చిన ఈ నౌకకు విశాఖ నేవల్‌ డాక్‌యార్డులో రీఫిట్‌ పనులు పూర్తి చేసి, మళ్లీ భారత నౌకాదళంలో సేవలు అందించేలా పునఃప్రారంభినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నౌకపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి, నామఫలకాన్ని ఆవిష్కరించారు. కమాండింగ్‌ అధికారిగా కమాండర్‌ సత్పాల్‌సింగ్‌ సంగ్‌వా వ్యవహరిస్తారని నేవీ వర్గాలు వెల్లడించాయి. దీనికి ఎంటీయూ ఇంజిన్‌తో పాటు వాటర్‌ జెట్‌ ప్రొపల్షన్‌, ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థ సిద్ధం చేశారు. కోస్తా తీరంలో ‘ఐఎన్‌ఎస్‌ తర్ముగ్లీ’ రక్షణ విధులు నిర్వహించనుంది.