
( డిసెంబర్ 15 – శ్రీ పొట్టి శ్రీరాములు వర్థంతి )
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన ఈ దీక్షాతత్పరుడు, సాంఘీక సంస్కరణలకై అహరహము తపించారు. శ్రీ పొట్టి శ్రీరాములు 1901 మార్చ్ 16న మద్రాసు అన్నా పిళ్ళై వీధిలోని 165వ నంబర్ ఇంట పేద ఆర్య వైశ్య కుటుంబంలో పొట్టి గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం మద్రాసులో జరుగగా 1920వ సంవత్సరంలో బొంబాయి నగరంలో శానిటరీ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందారు. 1924 నుంచి 1929 మధ్యకాలంలో ఐ.పి.జి.లో రైల్వే శానిటరీ ఇంజనీరుగా పని చేశారు. పొట్టి శ్రీరాములకు 1926లో తన మేనకోడలు సీతమ్మతో వివాహం కాగా తొలికాన్పులో తల్లి, బిడ్డ మరణించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయన మాతృమూర్తి కూడా పరమపదించారు. దీంతో విపరీతమైన వైరాగ్యానికి గురైన ఆయన తన జీవితాన్ని గాంధీగారి అహింసా మార్గం వైపు, దేశ సేవకై మళ్లించారు.
గాంధీజీ జాతికి ఇచ్చిన పిలుపు మేరకు శ్రీ పొట్టి శ్రీరాములుగారు తొలిసారిగా సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. అనంతరం 1930వ సంవత్సరంలో దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. 1933వ సంవత్సరంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ నాయకత్వంలో భూకంప బాధితులకు సేవలందించారు. 1936-37 మధ్యకాలంలో ఎర్నేణి సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో కృష్ణాజిల్లాలోని కొమరవోలు గాంధీ ఆశ్రమంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టై కలకత్తాలోని అలీపూర్ సెంట్రల్ జైలులో నిర్బంధించబడ్డారు. 1943లో గుడివాడ టౌన్‌లో ‘ఫ్లాగ్ మార్చ్’ జరిపినందుకు అరెస్ట్ అయ్యారు. 1947లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో సంచాలకులుగా పని చేశారు. 1944 నుంచి 1952 మధ్యాకాలంలో నెల్లూరు పట్టణంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వీరికి ఆచార్య పి.సి.రెడ్డి, ఏనుగు పట్టాభిరామిరెడ్డి, పి.సుబ్రహ్మణ్యాచారి, సుంకు చెంగన్న, అప్పల ఆంజనేయులు, డాక్టర్ నాగేశ్వరరావు వంటి ప్రముఖులు ఎన్నో రకాలుగా సహకరించారు.

పొట్టి శ్రీరాములు గారు 1945 సెప్టెంబర్ 9న హిందూ సంఘ సంస్కరణ సమితిని ప్రారంభించి వితంతు వివాహాలు, వర్ణాంతర వివాహాలు, ఆర్య వివాహలు, హరిజన అభ్యుదయము, హరిజన దేవాలయ ప్రవేశము, అనాథ శవాల దహన సంస్కారము, మద్యనిషేధ ప్రచారము, స్త్రీ సంక్షేమం, సహపంక్తి భోజనాలు వంటి సాంఘిక సంస్కరణాత్మక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. 1946 మార్చ్ 7 నుంచి 16వ తేదీ వరకు నిరాహార దీక్ష చేసి నెల్లూరు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో హరిజన ప్రవేశానికి అనుమతి సాధించారు. అలాగే ఆయన దీక్షా ఫలితంగానే తిరుమల శ్రీవారి ఆలయంలోకి హరిజనుల ప్రవేశం జరిగింది. 1949లో వార్థాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు గారు 28 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడంతో డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్పందించి మదరాసు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ‘హరిజన దినం’ అమలు జరిపించారు.
స్వాతంత్ర్యానంతరం అవిభక్త మద్రాసులో వున్న తెలుగువారు ఎప్పటినుంచో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుకుంటున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కొందరు జాతీయ నాయకులు ప్రత్యేకాంధ్ర వైపు మొగ్గు చూపారు. అయితే నాయకుల మధ్య అనైక్యత వల్ల 1952 వరకు ప్రత్యేకాంధ్ర కార్యరూపం దాల్చలేదు. దీంతో 1952 అక్టోబర్ 19న మద్రాసులో మహర్షి బులుసు సాంబమూర్తి ఇంటి వద్ద పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. 58 రోజుల పాటు దీక్ష కొనసాగించి డిసెంబర్ 15న అసువులు బాశారు. ఆయన ప్రాణ త్యాగంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచింది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ప్రసిద్ధి పొందింది.
పట్టుమని పది మంది పొట్టి శ్రీరాములు వంటి మహావ్యక్తులు ఉంటే మన పవిత్ర భారతదేశానికి ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్ర్యం తెచ్చి పెట్టగలను అని గాంధీజీ అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు గారు పదవుల కోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం ఏనాడూ పోరాడలేదు. సత్యాహింసలు, హరిజనోద్ధరణ, త్యాగమే ధనంగా జీవించి ఆంధ్రుల హృదయాల్లో అమర జీవిగా నిలిచిపోయారు. ఆయన త్యాగనిరతి నేటి యువతకు ఆదర్శం





