News

అయోధ్య రామమందిరం : రూ.900 కోట్లు ఖర్చు..మిగులు నిధులు 3 వేల కోట్లు..!!

279views

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు గడువు సమీపిస్తుండటంతో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గుడి నిర్మాణానికి, భక్తులకు సౌకర్యాల కల్పనకు ఇప్పటివరకు రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేశామని అయోధ్య ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవగిరి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలతో ట్రస్టుకు కుబేరుని ఆశీర్వాదం ఉందని, తమ వద్ద ఇంకా రూ.3 వేల కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు వెల్లడించారు.

జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ ట్రస్టు భావిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అయోధ్యలో వేర్వేరుచోట్ల 10 పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నట్లు రామమందిర ట్రస్ట్‌ సభ్యుడు డాక్టర్‌ అనిల్‌ మిశ్ర తెలిపారు. ‘‘ప్రాణప్రతిష్ఠ సమయంలో 12 వేల నుంచి 15 వేల మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. సాధువులు సహా మేము ఆహ్వానించిన ప్రముఖులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. వేర్వేరు బృందాలకు ఈ బాధ్యతలు అప్పగించాం’’ అని వివరించారు.