ArticlesNews

ఆద్యంతం ఆధ్యాత్మికం వెయ్యేళ్ల ‘అన్నమయ్య’ కాలిబాట

346views

అదివో..అల్లదివో అంటూ శ్రీవారిని స్మరిస్తూ.వేడుకొంటూ అత్యంత భక్తితో రాజంపేట మండలంలోని తాళ్లపాక వాసి పదకవితాపితామహుడు అన్నమాచార్యులు ఏడు కొండలను ఎక్కిన కాలిబాట అది. ఇది వెయ్యేళ్ల కిందటి మాట. ఆహ్లాదకరమైన దట్టమైన అటవీ మార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆరోజుల్లో పూర్వీకులు వేల సంఖ్యలో వెళ్లేవారు. అన్నమయ్య వారసులు సైతం ఈ మార్గంలో కొండకు నడిచివెళ్లారు. టీటీడీ అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి నడుంబిగించి భక్తులను ఆనంద పరవశులను చేస్తోంది.

కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి పై 32వేల కీర్తనలు రాసి ఆలపించి, మహాభక్తునిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచా ర్యులు తిరుమలకు నడిచి వెళ్లిన కాలిబాటలో వెళ్లడం మహాభాగ్యంగా శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఆ కాలిబాటలో తిరుమల కొండకు చేరుకుంటున్నారు.

కాలిబాట స్వరూపం ఇలా..

● మామండూరు–బాలపల్లె మధ్య స్వామిపాదాల నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. పక్షుల కిలకిలలు, సెలయేళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ కొండకు చేరుకుంటుంది.

● అవ్వతాత గుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటలు, ఈతకాయల మండపం నుంచి గోగర్భతీర్ధం(తిరుమల) చేరుకుంటుంది.

● సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉంటుంది.

● పాదాలు, అక్కడి కోనేరు, సత్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి.

కాలిబాటకు వెయ్యేళ్లు..

రాజంపేట మండలంలోని తాళ్లపాక నుంచి అన్నమయ్య నడిచివెళ్లిన కాలిబాట నేడు శిథిలమైంది. వెయ్యేళ్ల క్రితం ఉన్న రహదారి అభివృద్ధిపై తిరుమల తిరుపతి దేవస్ధానం దృష్టి సారించింది. ఈ బాట ద్వారా వెయ్యేళ్ల క్రితం నుంచి భక్తులు గోవింద నామస్మరణలు చేసుకుంటూ శ్రీవారి సన్నిధికి చేరుకుంటూనే ఉన్నారు.

ఉత్తర, దక్షిణ భారతీయులకు అనుకూలం..

పూర్వం తిరుమలకు ఈ దారి గుండా అధిక సంఖ్యలో శ్రీవారి భక్తులు వెళ్లేవారు. అయితే తిరుపతి నుంచి ఏడుకొండలు మీదుగా తిరుమల చేరుకోవడం నేడు పరిపాటిగా మారింది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంతోపాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు తిరుపతికి వెళ్లకుండానే నేరుగా అన్నమయ్య కాలిబాట ద్వారా స్వామి సన్నిధికి చేరుకోగలరు. స్వామి సన్నిధికి చేరుకునే పుణ్య పవిత్రమైన మార్గంగా కాలిబాట ప్రాచుర్యం పెరుగుతోంది.

ఈనెల 15న శుక్రవారం అన్నమయ్య జిల్లా నుండి వేలాదిమంది అన్నమయ్య కాలిబాటలో పాదయాత్రను చేపట్టి ఏడుకొండలు చేరుకోనున్నారు.