News

మసీదుల్లోకి మహిళలను అనుమతించండి : తెలంగాణ హైకోర్టు

222views

మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించకపోవడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టింది. మహిళల పట్ల వివక్ష తగదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడం సరికాదని పేర్కొంది. మసీదులు, జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలనూ అనుమతించాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మసీదులు, జాషన్స్ తదితర మందిరాల్లోకి ప్రార్థనల నిమిత్తం మహిళలను అనుమతించాలని ఆదేశించింది. అలాగే ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశాన్ని ఎందుకు నిషేధిస్తున్నారో, దానికి సంబంధించి పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఎక్కడ ప్రస్తావించిందో పూర్తివివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వక్ఫ్ బోర్డును ఆదే శిస్తూ విచారణను వాయిదా వేసింది. మసీదులు, జాషన్స్ తదితర పవిత్ర ప్రాంతాల్లో ప్రార్థనలకు షియా ముస్లిం మహిళలను అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఎ అలవి, షియా ఇమామియా ఇత్నా అషారి అక్బరీ సొసైటీ కార్యదర్శి ఆస్మా ఫాతిమా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు.

వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఖురాన్ ప్రకారమే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. మహిళల పట్ల వివక్ష ప్రదర్శిచండం తగదని, వారికి రాజ్యాంగం సమానత్వ హక్కులను కల్పించిందని స్పష్టం చేశారు. ఖురాన్, బైబిల్, తోహా, భగవద్గీత వంటి గ్రంథాల్లోని అంశాలతోపాటు వివేకానంద మహిళల గురించి చెప్పిన విషయాలను హైకోర్టు ప్రస్తావించింది.