ArticlesNews

కార్తిక పౌర్ణమి రోజు వెలిగించే జ్వాలా తోరణం ప్రత్యేకత

533views

హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తిక మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమే అయినప్పటికీ కార్తిక పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత ఉంది. ఇదే రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి మరింత విశిష్టత ఉంది. కార్తిక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పెట్టి ఓ కర్రను అడ్డంగా వాటిపై పెట్టి, ఎండుగడ్డిని తోరణంలా కడతారు. దీనిని యమద్వారం అంటారు. ఈ గడ్డిపై నెయ్యిపోసి మంట వెలిగిస్తారు.ఆ జ్వాల కిందనుంచి పరమేశ్వరుడిని పల్లకిలో మూడుసార్లు ఊరేగిస్తారు.

జ్వాలా తోరణం ఎందుకు?
మరణానంతరం యమలోకంలో అడుగుపెట్టిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి అగ్ని తోరణం గుండానే లోపలకి అడుగుపెడతారట. పాపాత్ములకు వేసే ప్రథమ శిక్ష ఇదే అని..ఈ శిక్షను తప్పించుకోవాలంటే పరమేశ్వరుడిని ప్రార్థించడం ఒక్కటే మార్గం అంటారు. అందుకే కార్తిక పౌర్ణమి రోజు ఎవరైతే ఈ యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటూ వెళ్ళి వస్తారో వారికి యమలోకంలో అడుగుపెట్టాల్సిన అవసరం లేకపోవడమే కాదు..శివ శాయుజ్యం పొందుతారని చెబుతారు. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిచే అవకాశం వస్తే.. శివా..ఇప్పటి వరకూ చేసిన పాపాలు ఈ మంటల్లో కాలిపోవాలి..ఇకపై ఎలాంటి తప్పుచేసే పరిస్థితి రాకుండా సన్మార్గంలో నడిచేలా చేయమని నమస్కరించాలి. ఈ జ్వాలతోరణాన్ని దర్శించుకుంటే సకలపాపాలు నశిస్తాయని, జ్వాలాతోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయని, జ్వాలాతోరణ దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని పండితులు చెబుతారు.

జ్వాలాతోరణ మహోత్సవాన్ని శ్రీనాథుడు ఇలా వర్ణించాడు
“కార్తికపౌర్ణమివేళ భీమశంకరుని నగరమందు
దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు
వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ
ఘోర భీకర యమద్వార తోరణంబు”

ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డి తీసుకొచ్చి – ఇంటి చూరులోనో, గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో పెట్టేవారు. ఈ గడ్డి ఉన్నచోట భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని, ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.

శ్రీశైలంలో వైభవంగా జ్వాలా తోరణోత్సవం

శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం జ్వాలా తోరణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత కాగడాలతో తోరణాలను వెలిగించారు. దేదీప్యమానంగా వెలుగుతున్న జ్వాలా తోరణాన్ని వేల మంది భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం కనుల పండువగా జరిగింది. కార్తిక పౌర్ణమి ఘడియలను పురస్కరించుకుని ఉదయం 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్ల అలంకార దర్శనం చేసుకున్నారు.