ArticlesNews

రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటి..ఎందుకు జరుపుకుంటారు..

462views

ప్రతి సంవత్సరం నవంబర్ 26న మన భారతదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయనిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడమంటే అంత సులువు కాదు. అందుకే రెండేళ్లకు పైనే సమయం పట్టింది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది మాత్రం గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా రెండు నెలల ముందు. అంటే 1949 నవంబర్ 26న.

రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టే ముందు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్…మహాత్మాగాంధీకి నివాళులు అర్పించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత జాతీయ గీతం ‘జనగణమన’ను స్వాతంత్ర్య సమరయోధురాలు పూర్ణిమా బెనర్జీ ఆలపించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా… రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. అయితే 2015 నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 11న ముంబైలో సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పునాది రాయి వేస్తూ ఈ ప్రకటన చేశారు. 2015లో భారత రాజ్యాంగ పితగా పిలుచుకునే డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 125వ జయంతి జరిగింది. ఆయన 1891 ఏప్రిల్ 14న జన్మించగా 1956 డిసెంబర్ 6న కన్నుమూశారు. 125వ జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరపాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం..ప్రత్యేక కమిటీని వేసింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ కమిటీ ఏడాది పాటూ ఉత్సవాలు నిర్వహించింది. అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా రకరకాల కార్యక్రమాల్ని నిర్వహించారు. ఆ క్రమంలో 2015 అక్టోబర్‌లో ముంబైలోని అంబేద్కర్ జ్ఞాపిక దగ్గర పునాది రాయి వేస్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ… రాజ్యాంగ దినోత్సవ ప్రకటన చేశారు. అలా 2015 నుంచి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుగుతోంది.

పేద బడుగు వర్గాల కోసం అంబేద్కర్ ఎంతగానో శ్రమించారు. తన జీవితాన్ని ధారపోశారు. ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. చిన్నప్పటి నుంచి అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డారో, కష్టపడి ఎలా చదువుకున్నారో…ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. అందువల్ల ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను నవంబర్ 26న విద్యర్థులు, ప్రజలకు తెలిసేలా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వాలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. నవంబర్ 26న కాలేజీలు, యూనివర్శిటీల్లో రాజ్యాంగంపై ప్రసంగాలు, డిబేట్లు నిర్వహిస్తారు. అలాగే…మాక్ పార్లమెంట్ వంటివి కూడా జరుపుతారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై విద్యార్థుల్లో అవగాహనను పెంచుతారు. సమాజం పట్ల వారిలో సేవానిరతిని పెంపొందిస్తారు. మొత్తంగా, రాజ్యాంగ పీఠిక మన రోజువారీ జీవితాల్లో భాగంగా మారాలి. అదే మన లక్ష్యం కావాలి.