
కార్తిక మాసం పరమ పవిత్రమైన మాసం. కార్తిక మాసంలో కార్తిక గోపాష్టమికి ఒక విశిష్టత ఉంది. కార్తిక గోపాష్టమి కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో ఎనిమిదవ రోజున వస్తుంది. ఈ రోజున గోవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తారు. గోపాష్టమి అనేది కృష్ణుడిని, గోవులను పూజించే పండుగ.
శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద ఎత్తిన రోజును గోపాష్టమిగా పరిగణిస్తారు. శ్రీ కృష్ణుడు గోవర్ధన గిరిధారియై గోపాలురను, గోవులను సంరక్షించిన రోజే గోపాష్టమి. ఈ రోజు భక్తులు గోపాలకుడైన కృష్ణుడిని పూజించటంతో పాటు గోవులకు పూజాధికాలు చేస్తారు. గోవులకు గోపాష్టమి రోజున పశుగ్రాసం, ఆకుపచ్చని బఠాణీలు, గోధుమలను ఆవుకు పెడితే.. సర్వాభీష్టాలు నెరవేరుతాయి. ఆవులో 33 కోట్ల దేవతలు కొలువైవుంటారు. గోవుకే మాత అనే హోదాను ఇచ్చారు. అలాంటి అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు.
హిందూ సంస్కృతిలో ఆవులను దేవతలుగా పూజిస్తారు. గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని భావిస్తారు. ఇక అటువంటి గోవులను పూజించే అత్యంత ముఖ్యమైన పండుగ గోపాష్టమి. గోపాష్టమి రోజున ఎవరైతే గోవును పూజించి దానికి ధాన్యం లేదా పండ్లను తినిపించి, గోవు యొక్క పృష్ట భాగమునకు నమస్కరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి చేసిన పాపాలు అన్నీ పోతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.





