
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి హిందూమతం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.అయోవాలో ది ఫ్యామిలీ లీడర్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హిందూ మత విశ్వాసం తనకు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచ్చిందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు.అధ్యక్ష రేసులో నిలిచేందుకు కూడా ఆ విశ్వాసమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడన్నది హిందూ మత మౌలిక విశ్వాసమని వివేక్ చెప్పారు.
హిందూ విశ్వాసమనే తనను అధ్యక్ష ఎన్నికల వైపు నడిపించిందని వివేక్ రామస్వామి వెల్లడించారు. ‘‘నా విశ్వాసమనే నాకు స్వేచ్ఛనిచ్చింది. నా విశ్వాసమే నన్ను అధ్యక్ష ఎన్నికల వైపు నడిపించింది. నేను హిందువును. నిజమైన దేవుడు ఒక్కడే అని నమ్ముతాను. దేవుడు మనలో ప్రతీ ఒక్కర్ని ఒక ప్రయోజనం కోసం ఇక్కడ ఉంచాడని నమ్ముతాను. హిందూ విశ్వాసం మనకు కర్తవ్యం, నైతిక బాధ్యతను బోధిస్తుంది. మన ద్వారా దేవుడు వివిధ మార్గాల్లో పనిచేస్తుంటారు. దేవుడు మనందరిలో ఉన్నందును మనం ఎప్పటికీ సమానమే, అదే నా విశ్వాసం’’ అంటూ హిందూ ధర్మం గురించి చెప్పారు.హిందూమతం నేర్పిన విలువలకు కట్టుబడి ఉంటానని, వాటిని తర్వాత తరాలకు తెలియజేస్తానని అన్నారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం డినాల్డ్ ట్రంప్, వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ వంటి వారు పోటీ పడుతున్నారు. వీరిలో ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రోన్ డీశాంటిస్ ముందంజలో ఉన్నారు. వివేక్ రామస్వామి మూడోస్థానంలో ఉన్నారు. వచ్చే ఏడాది నవంబర్ 24న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.





