News

జీవితాంతం – జీవితానంతరం – సేవే వారి సందేశం

688views

విశాఖపట్నం గాయత్రీ కళాశాలలో లెక్చరర్ గా,  ప్రిన్సిపాల్ గా పని చేసి రిటైర్ అయిన  శ్రీ ఎస్.టి.జి రామచంద్రాచారి గారు జూన్ 7 న స్వర్గస్తులైనారు. వారు రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు వెనక నుండి వచ్చిన బైక్ గుద్దుకోవడంతో బ్రెయిన్ డెడ్ అయినది. రామచంద్రాచారి గారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా ప్రముఖ్ గా పనిచేశారు. విశాఖపట్నం కేంద్రంగా శ్రీ రామచంద్రాచారి ABVP కి అందించిన సేవలు గణనీయం. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ వనవాసి కళ్యాణాశ్రమ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీ రామచంద్రాచారి నిరంతర సంఘసేవకుడు. శ్రీ రామచంద్రాచారి తాను బ్రతికున్నప్పుడు ఎందరో పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, పుస్తకాలు కొనివ్వడం మెడికల్ క్యాంపులు పెట్టడం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహించడం ఇలా నిరంతరం సమాజ సేవకే అంకితం అయి వుండే వారు. శ్రీ రామచంద్రాచారి కుటుంబం సంఘ్ పరివార్ కార్యకర్తలను తమ కుటుంబ సభ్యుల వలే ఆదరించేది. ఆఖరు రోజున కూడా రాజమహేంద్రవరంలో ఆరెస్సెస్ శాఖకు హాజరై, రోడ్డు దాటుతూ మోటారు సైకిల్ ఢీకొనడంతో తీవ్ర ప్రమాదానికి గురయిన శ్రీ రామచంద్రాచారి గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాశ విడిచారు. ఇంతటి విషాద సమయంలో కూడా ఆ కుటుంబ సభ్యులు వీరి అవయవాలను దానం చేసి మరి కొందరికి ప్రాణ దానం చెయ్యడం ద్వారా తమ ఔదార్యాన్ని, సేవా గుణాన్ని చాటుకున్నారు. వీరిని కడసారి చూడడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు అపోలో ఆసుపత్రికి తరలి వచ్చారు. అనంతరం వారి పార్ధివ దేహాన్ని సందర్శకుల దర్శనార్ధం 8/6/2019 సాయంత్రం 4 గంటలకు ఎందాడ గీతం యునివర్సిటీ రోడ్డులోని వనవాసీ కళ్యాణాశ్రమ్ కార్యాలయానికి తరలించడం జరిగింది. అనంతరం వేలాది విద్యార్ధులు, అభిమానులు, స్నేహితుల కన్నీళ్ళ మధ్య వారి అంతిమ యాత్ర, అంత్య క్రియలు జరిగాయి. అందరూ బరువయిన హృదయాలతో వారికి అశ్రు నివాళి సమర్పించారు.