
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ-JNU మాజీ స్టూడెంట్ లీడర్ షెహ్లా రషీద్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లోని పరిస్థితులను గాజాతో పోల్చకూడదని అన్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని సమస్యను రక్తపాతం లేకుండా ప్రధాని పరిష్కరించారని కొనియాడారు.
‘‘కశ్మీర్‌లో రాళ్లు రువ్వే ఆందోళనకారుల పట్ల గతంలో నేను సానుభూతి చూపించిన మాట వాస్తవమే. కానీ, ఈ రోజు అక్కడి పరిస్థితులను చూసిన తర్వాత నేను ప్రభుత్వానికి రుణపడి ఉన్నాను. కశ్మీర్‌లోని పరిస్థితులను మనం గాజాతో పోల్చలేం. కశ్మీర్.. మరో గాజా కాదని ఇప్పటికే స్పష్టమైంది. ఎందుకంటే కశ్మీర్‌లో అక్రమ చొరబాట్లు, తిరుగుబాటు, ఆందోళనల వంటి ఘటనలు జరిగాయి. ఈ ఉద్రిక్తతలకు ఎవరో ఒకరు పరిష్కారం చూపించాలి. అది మన ప్రభుత్వం చేయగలిగింది. వారు దీనికి రాజకీయంగా పరిష్కారం చూపారు. అది కూడా ఎలాంటి రక్తపాతం లేకుండా..!’’ అని షెహ్లా రషీద్ వ్యాఖ్యానించారు.
కాగా.. జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితులను ఉద్దేశిస్తూ షెహ్లా రషీద్ భారత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఆగస్టులో దీనిపై ఆమె మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు తగ్గాయని, పాలన మెరుగుపడిందని, కేంద్ర ప్రభుత్వ చర్యలతో ప్రజలు ప్రాణాలకు భద్రత ఏర్పడిందన్నారు. గత నెల గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులను ప్రారంభించిన సమయంలోనూ షెహ్లా స్పందిస్తూ.. భారతీయులుగా మనం ఎంతో అదృష్టవంతులమని అన్నారు. కశ్మీర్‌లో శాంతి, రక్షణ కోసం భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్ బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు.





