
మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాల మీద యువతరంలో మరింత అనురక్తి పెంచాల్సిన ప్రధాన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనని రచయిత, వక్త జంధ్యాల శరత్ బాబు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన ధర్మ ప్రచార పరిషత్ పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహిస్తోంది. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా, కోటబొమ్మాళి ప్రాంతం కొత్తపల్లిలోని ఉమా నీలకంఠేశ్వర ఆలయంలో బుధవారం ఆయన ప్రసంగించారు.యువతరానికి సంస్కృతి, సంప్రదాయల గురించి తెలియజెప్పాలని.. పెద్దల నడవడి చూసి పిల్లలు నేర్చుకుంటారని, అదే వారిని తీర్చిదిద్దుతుందని తెలిపారు. ఇక్కడ మొదలైన మూడురోజుల ఉపన్యాసాలు గురువారంతో పూర్తవుతాయని జిల్లా శాఖ ప్రోగ్రాం అసిస్టెంట్ ఎం.లలిత మణి, నిర్వాహకుడు సీహెచ్. ప్రసాద రావు ప్రకటించారు. ఉపన్యాసం అనంతరం భజన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.





