
గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఖతార్ ప్రభుత్వం 8 మంది మాజీ ఇండియన్ నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేసిన అక్కడి అధికారులు, ఇటీవల మరణశిక్ష విధించారు.దీనిపై భారత్ షాక్‌కి గురైంది. దీనిపై న్యాయపరంగా, దౌత్యపరంగా పోరాటానికి భారత్ సిద్ధమైంది.
8 మంది భారతీయులకు మరణశిక్ష విధించడంపై భారత్ ఖతార్‌లో అప్పీల్ దాఖలు చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. ఇప్పటికే అప్పీల్ దాఖలు చేసినట్లు చెప్పారు. గతంలో ఈ తీర్పు పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవని బాగ్చి చెప్పారు. తదుపరి చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో 8 మంది కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నామని, సాధ్యమైన సాయాన్ని అందిస్తామని చెప్పారు.
మన దేశానికి చెందిన ఎనిమిదిమంది నౌకాదళ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష పడిన కేసులో అప్పీలు దాఖలు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ) గురువారం ప్రకటించింది. నిర్బంధంలో ఉన్న అధికారులను కలిసేందుకు ఖతార్ నుంచి భారత రాయబార కార్యాలయానికి మరో అనుమతి లభించిందని ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి వెల్లడించారు. నౌకాదళ మాజీ అధికారులకు న్యాయపరంగా, దౌత్యపరంగా పూర్తి సహకారాన్ని అందజేస్తామన్నారు.ఈ కేసు నుంచి బయటపడేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.





