గుజరాత్ లోని భుజ్ లో నవంబర్ 5-7 వరకు అఖిల భారత కార్యనిర్వాహక మండలి సమావేశం : ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారి మండల్ సమావేశం ఈ సంవత్సరం గుజరాత్‌లోని భుజ్‌లో జరగనుంది . ఈ సమావేశం ఈ నెల 5, 6 మరియు 7 తేదీల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల నుంచి ప్రాంత సంఘచాలక్‌లు, కార్యవాహ్ మరియు ప్రాంత ప్రచారకులు మరియు సహ సంఘచాలక్‌లు, సహ కార్యవాహ్ లు మరియు సహ ప్రాంత ప్రచారకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.అలాగే సర్ సంఘ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే జీ మరియు సహ సర్ కార్యవాహ్ డాక్టర్ కృష్ణగోపాల్ జీ, డాక్టర్ మన్మోహన్ వైద్య జీ, ముకుంద జీ, అరుణ్ కుమార్ జీ, రామదత్ చక్రధర్ జీ మరియు కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరుకానున్నారు. అఖిల భారత పదాధికారులతో పాటు విశ్వహిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ జనతా పార్టీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్‌తో సహా పలు సారూప్య సంస్థల నుంచి ఎంపిక చేసిన సంస్థ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బైఠక్ కి సంబంధించిన వివరాలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ పాత్రికేయులకు వివరించారు. సంఘ్ సంస్థ పనితీరుపై సమీక్షతోపాటు, విజయదశమి సందర్భంగా నాగపూర్‌లో జరిగిన సంఘ్ ఉత్సవాల్లో పూజ్యనీయ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ జీ సందేశంలోని దేశ వర్తమాన పరిస్థితులు, హిందుత్వం పై చేసిన ఆలోచనాత్మక ప్రసంగంలో ప్రస్తావించిన విషయాలను సమాజంలోకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే కోణంలో ఈ బైఠక్‌లో చర్చిస్తామన్నారు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు చేరేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చను కొనసాగిస్తామని అన్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని సమాజ స్థితిగతులపై వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారని, వారి సలహాలు, సూచనలపై కూడా బైఠక్‌లో చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. సంఘ్ లో ప్రధమ, ద్వితీయ, తృతీయ శిక్షా వర్గలను నిర్వహిస్తున్నామని… ఈ శిక్షా వర్గల్లోని పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని ఆలోచన ఉందని.. ఇందుకు సంబంధించి బౌద్ధిక్ ప్రముఖులు ఇప్పటికే తమ సూచనలు అందించారని . ఈ సూచనలు దృష్టిలో ఉంచుకొని పూణే బైఠక్‌లో విస్తృతంగా చర్చించామని వివరించారు.2024 జనవరి 22, న అయోధ్యలోని శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో సంఘ భాగస్వామ్యంపై, దేశవ్యాప్తంగా ప్రతిపాదిత కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ బైఠక్‌లో చర్చిస్తామని ఆయన చెప్పారు. దేశంలోని ప్రతి నగరం మరియు గ్రామంలోని వివిధ దేవాలయాలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం కోసం పిలుపునిచ్చారని… ఈ ముఖ్యమైన పనిలో సంఘ్ ఎలా పాల్గొంటుంది అనేది ఈ సమావేశంలో చర్చించిన తర్వాత సంఘం స్వయం సేవకులకి సమాచారం ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.
2025 కు సంఘ్ 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుందని..1925లో పరమ పూజ్యనీయ డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాటి నుంచి నేటి వరకు ఎదుగుతూ వచ్చిందన్నారు. సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కార్యాచరణ విస్తరణ పై ప్రధానంగా చర్చ జరుగుతుందని అన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శాఖల విస్తరణకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్ష జరుపుతున్నామని.. లక్ష్య సాధన దిశగా ప్రస్తుత బైఠక్‌లో కూడా సమీక్ష జరుగుతుందని వివరించారు. సంఘం నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏడాదిన్నర లోపు ఏ విధంగా చేరుకోగలమనే అంశంపై కూడా చర్చకు రానుందని.. అలాగే ఇప్పటివరకు అందుకున్న లక్ష్యాలపై కూడా సమగ్ర విశ్లేషణతో పాటు మరింత వేగంగా, సమర్థవంతంగా ముందుకు ఎలా వెళ్లాలనే దానిపై కూడా చర్చ జరుపుతామని తెలిపారు. విజయదశమి ప్రసంగంలో, సామాజిక మార్పు కోసం నిరంతరం కృషి చేయాలని సర్ సంఘ్ చాలక్ జీ పిలుపునిచ్చారు. సామరస్యం కోసం కృషి చేయడం, పర్యావరణానికి సంబంధించి జీవనశైలి ఎలా ఉండాలి, నీటిని ఆదా చేయడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం మరియు సంతోషకరమైన, సామాజికంగా పనిచేసే కుటుంబాన్ని ఎలా సృష్టించడం వంటి అంశాల పై అర్ధవంతమైన చర్చలు జరుపుతామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 45 ప్రాంతాల నుంచి 381 మంది కార్యకర్తలు బైఠక్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. నవంబర్ 5న ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యే ఈ బైఠక్ వరుసగా మూడు రోజుల పాటు నవంబర్ 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని పేర్కొన్నారు.





