News

వైభవంగా సిరిమానోత్స‌వం..అంబరాన్ని తాకిన భక్తుల సంబరం

208views

ఉత్త‌రాంధ్ర క‌ల్ప‌వ‌ల్లి, విజ‌య‌న‌గ‌రం ఇల‌వేలుపు శ్రీ పైడితల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం అత్యంత వైభవంగా జ‌రిగింది. ఆలయ సంప్రదాయాలు, ఆచారాల‌కు అనుగుణంగా ఉత్స‌వాన్ని మంగ‌ళ‌వారం జిల్లా యంత్రాంగం ప్ర‌శాంతంగా నిర్వ‌హించింది. ఎప్ప‌టిలాగే పాల‌ధార‌, అంజ‌లి ర‌థం, తెల్ల ఏనుగు, బెస్త‌వారి వ‌ల ముందు న‌డ‌వ‌గా, శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారు మూడుసార్లు విజ‌య‌న‌గ‌రం పుర‌వీధుల్లో సిరిమాను రూపంలో ఊరేగి, భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. త‌న పుట్టినిల్లు విజ‌య‌న‌గ‌రం కోట‌వ‌ద్ద‌కు వెళ్లి, రాజ కుటుంబాన్ని ఆశీర్వ‌దించారు. ఈ అపూర్వ ఘ‌ట్టాన్ని ప్ర‌త్య‌క్షంగా తిల‌కించిన భక్తులు పర‌వ‌శించిపోయారు.

విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిస్సా, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్రల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి సిరిమానోత్సవాన్ని తిలకించారు.