
దేవీ శరణం.. మాతా శరణం.. జగన్మాతా పాహిమాం.. జగజ్జననీ రక్షమాం.. నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. భవానీ దీక్షాధారులు జగమేలు తల్లి దర్శనానికి బుధవారం పోటెత్తారు. నియమ నిష్టలతో దీక్ష ఆచరించిన వీరు.. అమ్మను స్మరిస్తూ… స్తుతిస్తూ.. కీర్తిస్తూ.. అలుపెరగక వందల కిలోమీటర్ల దూరం నడిచి వచ్చారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి లక్షలాదిగా కాలినడకన బెజవాడ విచ్చేసి అమ్మలగన్నమ్మను దర్శించుకొని తరించారు. బుధవారం ఒక్కరోజే రాత్రి 10 గంటల వరకు 70 వేల మందికిపైగా భవానీ దీక్షాధారులు, భక్తులు దేవిని దర్శించుకున్నారు. క్యూలైన్లలో నీళ్లు, మజ్జిగ పంపిణీ ఆపేయడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన భవానీ దీక్షాధారులతో… ఇంద్రకీలాద్రి అరుణ తోరణం అలంకరించిన రీతిన శోభాయమానమైంది.
రికార్డు స్థాయిలో 22 లక్షల లడ్డూల విక్రయం…
దసరా ఉత్సవాల్లో భక్తులకు 9.50 లక్షల లడ్డూ ప్రసాదాలను కౌంటర్లలో విక్రయిస్తే, భవానీలు పోటెత్తిన తర్వాత మూడు రోజుల్లో 12.50 లక్షల ప్రసాదాలను విక్రయించారు. రోజుకు 4 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించారు. ప్రస్తుతం దేవస్థానం వద్ద కేవలం 2 లక్షలు మాత్రమే ఉండటంతో ఒక్కో భక్తునికి 6 లడ్డూలు మాత్రమే విక్రయిస్తున్నారు. దీంతో కుటుంబంలో నలుగురు ప్రసాదాల కౌంటరు వద్ద క్యూలైన్లో తాము అనుకున్నన్ని ప్రసాదాలు కొనేంత వరకు కదలని పరిస్థితి ఉందని పోలీసులు చెబుతున్నారు. రానున్న రెండు రోజులు కూడా భవానీ దీక్షాధారులు తరలి వచ్చే అవకాశం ఉందని భావించి పరిమిత సంఖ్యలో లడ్డూ ప్రసాదాలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గందరగోళంగా ఇరుముడి బియ్యం…
సరైన ప్రణాళిక లేక భక్తులు సమర్పించిన ఇరుముడి బియ్యం నేల పాలవుతోంది. ఇరుముడి సమర్పించే దీక్షాధారులు, వారి కుటుంబ సభ్యులు వాటిని తొక్కుకుంటూ వెళుతున్నా దేవస్థానం సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇరుముడి సమర్పించిన తర్వాత పలువురు భక్తులు గురుభవానీ వద్దే మాల విరమణ చేస్తున్నారు. సరైన స్థలం లేక రోడ్డు మీదే గురుభవానీలు మాల విరమణ చేశారు.





