
చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోందని అమెరికా రక్షణశాఖ పెంటగాన్ తెలిపింది. 2021తో పోలిస్తే డ్రాగన్ అమ్ములపొదిలోకి 2022లో మరో 100 కొత్త వార్‌హెడ్లు చేరాయని పేర్కొంది. చైనా సైన్యంలో 2022లో జరిగిన అత్యంత కీలకమైన పరిణామాలపై పెంటగాన్ తన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. చైనా వద్ద ప్రస్తుతం 500 అణు వార్‌హెడ్‌లు వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి సంఖ్య 2030 నాటికి 1,000కి చేరే అవకాశం ఉంది.
ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) వద్ద 300 ఖండాంతర క్షిపణులు భూగర్భ బొరియల్లో సిద్ధంగా ఉన్నాయి. దేశంలోని మూడు ప్రదేశాల్లో క్షిపణులు మోహరించడానికి వీలుగా భూగర్భ బొరియలను 2022లో నిర్మించింది. సంప్రదాయ వార్‌హెడ్‌లను ప్రయోగించే ఖండాంతర క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలను తీవ్రం చేసింది. విదేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. బర్మా, థాయ్‌లాండ్, ఇండోనేసియా, యూఏఈ, కెన్యా, నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, పపువా న్యూగినియా, సాల్మన్ ఐలాండ్స్, తజకిస్థాన్ వంటి చోట్ల లాజిస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక నౌకాదళంలో ఏడాది కాలంలో 30 సరికొత్త యుద్ధనౌకలను చేర్చింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా 370 యుద్ధనౌకలు చైనా వద్ద ఉన్నట్లైంది. ఈ సంఖ్య 2025 నాటికి 395.. 2030 నాటికి 435కు పెరగవచ్చు.
వాస్తవాధీన రేఖ వద్ద భారీగా నిర్మాణాలు
వాస్తవాధీన రేఖ వద్ద చైనా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినట్లు పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది. అండర్‌గ్రౌండ్ స్టోరేజీలు, కొత్త రోడ్లు, సైనిక-పౌర వినియోగానికి వీలుగా విమానాశ్రయాలు, భారీ సంఖ్యలో హెలిప్యాడ్లు నిర్మిస్తోందని చెప్పింది. అదే సమయంలో డోక్లాం వద్ద కూడా అండర్‌గ్రౌండ్ స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేసింది. పాంగాంగ్ సరస్సుపై రెండో వంతెనతో పాటు.. భూటాన్ సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతానికి సమీపంలో గ్రామాల నిర్మాణం చేపట్టింది.




