News

భారత్‌లో చొరబాటుకు యత్నం.. తిప్పికొట్టిన భద్రతాబలగాలు.. ఎన్కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతం

237views

జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడమే కాకుండా వాతావరణం ప్రతికూలంగా ఉండడం వల్ల నియంత్రణ రేఖ మీదుగా భారీగా ఆయుధాలతో ఉగ్రవాదుల బృందం చొరబాటుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడి చేరుకొని వారిని నిలువరించేందుకు యత్నించారు. ఈ క్రమంలో బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని.. మిగతా ఉగ్రవాదులు వారి మృతదేహాలను తీసుకొని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారని పేర్కొన్నారు. ఘటనాస్థలం నుంచి రెండు ఏకే రైఫిళ్లు, ఆరు పిస్తోళ్లు, నాలుగు చైనీస్‌ గ్రానైడ్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఫేక్ పాస్పోర్టులతో దేశంలోకి టెర్రరిస్టులు..
Terrorists Enters In India : ఇటీవలే నకిలీ పాస్పోర్టులతో భారత్లోకి అక్రమంగా ఉగ్రవాదులు ప్రవేశించినట్లు కేంద్ర నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. సుమారు 70 మంది టెర్రరిస్టులు నేపాల్ సరిహద్దుల నుంచి దేశంలోకి ప్రవేశించినట్లు భావించాయి. వీరంతా బంగ్లాదేశ్ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్)లేదా జమ్మాత్ ఉల్ ముజాహీద్దీన్ ఉగ్ర సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సరిహద్దులోని భద్రతాదళాలను అప్రమత్తం చేసింది కేంద్ర హోంశాఖ.

భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు కేంద్ర సంస్థ నిఘా వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో పాటు కేంద్ర భద్రతా సంస్థలు బంగాల్, సిక్కిం సహా పలు ప్రాంతాల్లో ఇప్పటికే సోదాలను నిర్వహించింది. ఇందులో నకిలీ పాస్పోర్టులతో కొందరు ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించినట్లు గుర్తించింది. ఉగ్ర సంస్థ ఖలిస్థానీతోపాటు ఇతర ఉగ్ర ముఠాలు, గ్యాంగ్‌స్టర్లు, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కొద్ది రోజుల క్రితం దేశంలోని పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది.