News

హామీ ఇస్తేనే కెనడాకు వీసాలు

217views

కెనడాలో భారత్‌ దౌత్యవేత్తల భద్రతకు హామీ లభిస్తేనే, ఆ దేశానికి వీసాలు జారీ ప్రక్రియను పునరుద్ధరిస్తామని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. ‘‘వీసాల అంశంపై అందరికీ ఆందోళన ఉంది. అయితే మా దౌత్యవేత్తల రక్షణ మాకు కీలకం. కెనడాలో కార్యాలయానికి వెళ్లి అధికారులు వీసాలు మంజూరు చేసే పరిస్థితి లేదు. అందుకే వీసాలను తాత్కాలికంగా నిలిపివేశాం. పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నాను. దౌత్యవేత్తలకు రక్షణ కల్పించడం వియన్నా ఒడంబడిక ప్రకారం..ప్రాథమిక బాధ్యత. ఆ ప్రాథమిక అంశానికి కెనడాలో సవాల్‌ ఎదురవుతోంది. పరిస్థితి మెరుగైతే.. వీసాల జారీని మళ్లీ ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తాం. ఇది తొందరగానే జరుగుతుందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

41 మంది దౌత్యవేత్తలను వెనక్కి తీసుకోమని కెనడాను భారత్‌ కోరడాన్ని మంత్రి సమర్థించారు. భారీ సంఖ్యలో ఆ దేశ దౌత్యసిబ్బంది.. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని.. అందుకే వారిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సంబంధాలు క్లిష్టదశలో ఉన్నాయని పేర్కొన్నారు.