
శ్రీవారి కానుకల్లో ఒక్క శాతం తిరుపతి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే టీటీడీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ పలు సంఘాల నుంచి బలంగా వినిపించింది. శ్రీవారికి మొక్కులు రూపంలో చెల్లించే కానుకలు, తిరుమల ఆదాయాన్ని ఏ ప్రభుత్వాలూ, వ్యక్తులు ఆశించరని, ఇతర అవసరాలకు సైతం వినియోగించరని, దేవుడికి తప్ప మరే కార్యక్రమం కోసం వినియోగించకూడదని టీటీడీ ఎదుట పలువురు భక్తులు గట్టిగా వాదనలను వినిపించారు. వెంకటేశ్వరుడి ఆదాయాన్ని ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యం కోసం, హిందూ ధర్మ ప్రచారానికి మాత్రమే వినియోగించాలని కోరారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. శ్రీవారి కానుకల్లో ఒక్క శాతం తిరుపతి అభివృద్ధికి కేటాయించాలన్న టీటీడీ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. టీటీడీ కార్యనిర్వహణ అధికారికి సర్క్యూలర్ పంపింది. ఈ మేరకు దేవాదాయ శాఖ మెమో విడుదల చేసింది.






